'హాయ్ సర్...ఎక్కడికి వెళుతున్నారు?'...
రైలు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న విక్రమ్ ఆ పలకరింపుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు..
'...పాలకొల్లు'
ఆమె ఎవరా అని ఆశ్చర్యంతో కూడిన కళ్ళతో చూస్తూ సమాధానమిచ్చాడు.
అతని ఆలోచన తనకు అర్థమైనట్టుగా కిలకిలా నవ్వేస్తూ...
'నా పేరు హర్షిత...మీతో ఇదే పరిచయం లేండి..ఇంతకు ముందెప్పుడూ మీరు నన్ను చూడలేదు'
తన ఆలోచనలను చాలా చక్కగా చదివినట్టుగా ఠక్కున ఆమె ఇచ్చిన సమాధానానికి అతని మోములో చిరునవ్వు మెరిసింది.
ఆమె కూడా అది అర్థమైనట్టుగా మరోసారి కిలకిలా నవ్వింది.
కాసేపు నిశ్శబ్ధం...ఇద్దరూ రైలు కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉండిపోయారు.
నిశ్శబ్ధాన్ని చేధిస్తూ ఆమె అడిగింది...'ఏంటి సార్..ఏదైనా పని మీద వెళ్తున్నారా?'
'లేదు...అమ్మ వాళ్ళను చూడటానికి వెళుతున్నా..'
'నేనూ మా అమ్మవాళ్ళను చూడటానికే వెళుతున్నా...మీ పాలకొల్లు పక్కనే ఉన్న గ్రామం మాది..'
'నేను విజయవాడలో ఒక ఆఫీసులో చేస్తున్నా..అప్పుడప్పుడూ అమ్మవాళ్ళను చూడటానికి వస్తుంటా..' చెప్పాడతను.
'నేనూ ఒక ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నా..సారీ...చేసేదాన్ని..'
'అదేం? మానేశారా?...' ఆశ్చర్యంగా అడిగాడతను.
'అవునండీ...అమ్మవాళ్ళను మిస్ అవుతున్నా...అందుకే...ఏదైనా చిన్న జాబ్ దగ్గరలోనే చూసుకుందామని..' తన మనసులో మాట బయటపెట్టింది హర్షిత.
'అయ్యో...మంచి జాబే అయ్యుంటుంది కదా...ఎందుకు మానేయడం?..' ..ఓదార్పుగా అడిగాడు విక్రమ్.
'మంచి జాబే సార్..కానీ, అమ్మవాళ్ళను వదిలి ఎక్కడో వేలకు వేలు తెచ్చుకునేకంటే, పెద్దవయసులో ఉన్నవారికి దగ్గరగా, తోడుగా ఉంటూ ఆ సాలరీలో సగం తెచ్చుకున్నా ఆర్థికంగా ఇబ్బందేం ఉండదు, పైగా మన వాళ్ళదగ్గరే ఉన్నామన్న ఆత్మసంతృప్తి ఉంటుంది.'
ఇంకేం మాట్లాడలేకపోయాడు విక్రమ్. కానీ మనసులో మాత్రం పలు ఆలోచనలు...రైలు కంటే వేగంగా గిరగిరా తిరుగుతున్నాయి.
మళ్లీ నిశ్శబ్దం...కొంత సమయం గడిచింది. మళ్ళీ నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఆమే పలకరించింది..'విజయవాడలో ఒక్కరే ఉంటున్నారా?'
'యా...ఐ యామ్ స్టిల్ బ్యాచిలర్ యూ నో...' కాస్త కామెడీగా ఆమెను నవ్వించడానికన్నట్టు అతను అలా అనేసరికి తను కూడా నవ్వేసింది.
ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు.....ఎన్నాళ్ళ నుంచో స్నేహితుల్లా ఇద్దరూ ఒకరి విషయాలను గురించి ఒకరికి చెప్పుకుంటూ మధ్యమధ్యలో జోకులు వేసుకుంటూ....
సమయం తెలియకుండానే వేగంగా గడిచిపోయింది. సాయంత్రం అయ్యింది.
'ఇంకొంచెం సేపట్లోనే మన స్టేషన్ వచ్చేస్తుంది..నేనూ మీతోపాటే దిగాలి సుమా...స్టేషన్ రాగానే ఏం సంబంధం లేనట్లు నన్నొదిలేసి గబగబా దిగేయడం కాదు, అయ్యో ఆడపిల్ల సాయం చేద్దాం అనుకోవాలి..'
చిన్నపిల్లలా తను అలా అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు పెదవులపై చిరునవ్వు వెల్లివిరిసింది విక్రమ్ కి.
'అలాగే మేడం...మీరు ఎలా చెబితే అలా...' మహారాణి ఎదుట సేవకుడు చిత్తం మహారాణి అంటూ చేసినట్టుగా చేసాడు విక్రమ్.
అతనలా చేసేసరికి ఆమెకూ నవ్వు వచ్చింది. '...ఆ అదీ..మేమంటే ఆమాత్రం భయభక్తులు ఉండాలి మరి...' అంటూ కిలకిలా నవ్వేసింది.
స్టేషన్ రానే వచ్చింది. తన బ్యాగు భుజాన వేసుకుని ఆమె దగ్గర ఉన్న మూడు బ్యాగులలో రెండు తన భుజాలకు తగిలించుకున్నాడు విక్రమ్.
'అయ్యో..అయ్యో...సరదాకి అన్నానండీ...నేను మోస్తాను పర్వాలేదు...'అంటూ అతని దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించింది హర్షిత.
'అయ్యో పర్వాలేదు...త్వరగా దిగుదాం...ఈ రైలు ఎక్కే జనాలు మనల్ని దిగనివ్వకుండా లోపలే ఉంచేస్తే, రైలు కదిలిపోతే కష్టం..'
'అమ్మో...నిజమే..పదండి పదండి..' అంటూ అతనికంటే తనే ముందు దారిచూపిస్తూ, గుమ్మం దగ్గర ఎక్కేవారిని బాబూ కొంచెం దిగనివ్వండి అంటూ తాను దిగి మళ్ళీ వెనక్కు తిరిగి అతనివద్దనున్నబ్యాగులు అందుకుంటూ అతనిని చిన్నపిల్లాడిని చేయి పట్టుకుని దించినట్టు దించింది.
గబగబా ఆ రైలు, ఆ జనాల తోపులాట నుంచి ఇవతలికి వచ్చేసారు ఇద్దరూ.
'రైల్లో గంటల తరబడి జర్నీ చేయడం ఒకెత్తు...ఈ జనాలను తోసుకుంటూ ఎక్కడం దిగడం ఒకెత్తు..చాలా కష్టం సుమా' అన్నాడు విక్రమ్
'హా..అవును బాబోయ్..ఏం జనాలో..ఏం తోపులాటలో..అవతలి వ్యక్తి గురించి బొత్తిగా ఆలోచన ఉండదు..' నొసలు చిట్లిస్తూ కాస్తంత చిరుకోపంగా, అలసటగా, ముఖం మీద పడుతున్న ముంగురులను పక్కకు తోస్తూ అంటున్న హర్షిత కొంచెం కొత్తగా కనిపించింది అతనికి.
ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చేసారు.
'మీ గురించి ఎవరైనా వస్తారా తీసుకువెళ్ళడానికి?'
'ఏం? అప్పుడే నన్ను వదిలించుకుందామనా?...ఆకలేస్తోందిరా మగడా...ఇందాకటినుండి పట్టాలమీదనే కాదు, కడుపులోనూ రైళ్ళు పరుగెడుతున్నాయి. '...ఆకలి వేసినప్పుడు చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి అతని భుజం గట్టిగా పట్టుకుని ఆమె అలా అడిగేసరికి నాలిక్కరుచుకున్నాడు విక్రమ్.
'అవును కదా...అయ్యో నిజమే..మనం రైలులో బఠాణీలు, శెనగలు, బిస్కెట్లు వగైరా ఆమాంబాపతు చిరుతిండ్లు తిన్నాం తప్పితే భోజనం చేయాలన్న ఆలోచన రాలేదు, భోజనం తెప్పించుకుంటే బాగుండేది..'
'ఆ..అవును..పదండి ఏదైనా హోటల్ కి వెళదాం..'
భోజనాలయ్యాయి. ఇద్దరూ బ్యాగులు భుజాన వేసుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ నడక ప్రారంభించారు.
'ఇందాక చెప్పలేదు...ఎవరైనా వస్తారా?..మిమ్మల్ని వెతుక్కుంటారేమోనని అడుగుతున్నా...అంతే సుమా..' ఏదో భయం భయంగా అడుగుతున్నట్టుగా అడిగాడు విక్రమ్.
తాను ఇందాక అన్న మాటలు గుర్తొచ్చి కిసుక్కున నవ్వింది హర్షిత. 'లేదండీ...నాకు అలవాటే..నేనే వెళ్ళొస్తుంటా'
'దూరం అంటున్నారు...సాయంత్రం అయిపోయింది..'
'పోనీ...మీరే దించేయండీ...నాకైతే ఏం అభ్యంతరం లేదు..' అదేదో టూత్ పేస్ట్ యాడ్ లో మాదిరిగా పలువరుస అందంగా కనిపించేలా హాయిగా నవ్వేసింది హర్షిత.
'సరే..మీకు అభ్యంతరం లేకపోతే నేనూ రెడీనే...మిమ్మల్ని క్షేమంగా మీ ఇంట్లో దించే పూచీ నాది..' ఆమెకు ఏదో ధైర్యం చెబుతున్నవాడిలా ఫోజిస్తూ చెప్పాడు విక్రమ్.
మళ్ళీ కిలకిలా నవ్వేసింది హర్షిత.
'ఇంతకీ ఏ ప్రాంతంలో ఉంటున్నారు మీవాళ్ళు?' అడిగిందామె
తన చిరునామా చెప్పాడు విక్రమ్
తాను వెళ్ళవలసిన దారి విక్రమ్ వాళ్ళు ఉండే వైపు నుంచే వెళ్ళాలన్న సంగతి తెలిసేసరికి విక్రమ్ ను ఆటపట్టించాలనుకుంది హర్షిత.
'నేను ఇవాళ మీ ఇంటికి వచ్చేసి రేపు మా ఇంటికి వెళతాను..మీకేం ఇబ్బంది లేదుగా?'
తాను అలా అంటుందని ఊహించని విక్రమ్ కొద్దిగా ఆశ్చర్యానికి లోనై, తమాయించుకుని, 'అయ్యో...మాకేం ఇబ్బంది ఉండదు..పైగా రాత్రవుతోంది. నిజంగానే మీరు మా ఇంట్లో ఉండి రేపు వెళ్ళవచ్చు. స్వయంగా నేనే మీ ఇంట్లో మిమ్మల్ని దిగబెట్టి వస్తాను...సరేనా?' అన్నాడు.
'రాజువయ్యా...మహరాజువయ్యా...' ఆమె హమ్ చేస్తున్నట్టు పాడేసరికి పకపకా నవ్వేసాడు విక్రమ్.
ఇప్పటివరకూ చిరునవ్వే తప్ప అంతలా నవ్వని విక్రమ్ ను చూసి తాను కూడా ఆనందంగా నవ్వేసింది హర్షిత.
తాను వెళ్ళాల్సిన మార్గం వారి ఇంటివైపునుండే వెళ్ళాలని, అందుకనే తాను సరదాగా అలా అన్నానంటూ చెప్పింది.
విక్రమ్ మాత్రం తాను మనస్పూర్తిగానే రమ్మన్నానని, తన ఇంట్లోవాళ్ళు ఏమీ అనుకోరని, రావాల్సిందేనంటూ పట్టుబట్టడం మొదలుపెట్టాడు. చీకటి పడుతోందని, రేపు పొద్దున్నేఆమెను దించే బాధ్యత తనదంటూ బతిమాలాడటం ప్రారంభించాడు.
చివరికి ఆమెకు ఒప్పుకోక తప్పింది కాదు.
2
రాత్రి 7 దాటింది ఇంటికి చేరేసరికి...
గేటు శబ్దం అవ్వగానే బయటకి వచ్చిన అమ్మ తమని చూస్తూనే 'ఏమండీ..అబ్బాయి వచ్చాడు..' అంటూ తన భర్తను పిలుస్తూనే, గేటు తీయడానికి వచ్చి గేటు తీస్తూనే విక్రమ్ చేతిలో ఉన్న బ్యాగు, హర్షిత చేతిలో బ్యాగు అందుకుంటూ, 'ఏమ్మా...ప్రయాణం బాగా జరిగిందా?' అని అడిగింది.
ఆ అమ్మాయి ఎవరూ ఏమిటీ అనే ఆరాలేమీ లేకుండా అలా ఎంతో పరిచయమైన అమ్మాయిని పలకరించినట్టు పలకరించేసరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు విక్రమ్.
విస్తుపోయి చూస్తున్న విక్రమ్ ను చూసిన హర్షితకు నవ్వు ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు..
'ప్రయాణం బానే జరిగిందాంటీ...మీ అబ్బాయి ఉన్నాడుగా..దార్లో కబుర్లతో అసలు టైమే తెలీలేదు'..ఓరకంట విక్రమ్ ను చూస్తూనే అంది.
'సరే ఫ్రెష్ అయ్యి రండి..భోజనం చేద్దురుగాని...దార్లో ఏమన్నా తిన్నారో లేదో...'
ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టి చూస్తున్న విక్రమ్ ను మరింత ఆటపట్టించాలనిపించింది హర్షితకి...'అయ్యో...మీ అబ్బాయి నన్ను ఆకలితో ఉంచడమా..దారి పొడుగునా ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు..' అంది.
అసలేం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు.
తనను పలకరించకుండా ఏదో లోకంలో ఉన్నవాడిలా వెళ్ళిపోతున్న కొడుకు వంక విస్తుపోయి చూస్తూ నిలబడిపోయాడు తండ్రి.
అంతా గమనిస్తూనే ఉన్న హర్షితకు విక్రమ్ ఆలోచనలు అర్థమవుతూనే ఉన్నాయి. ఏమాత్రం పరిచయం లేని తనను తన తల్లి అంతలా ఆప్యాయంగా పలకరించడం, కనీసం ఎవరీ పిల్ల అని కూడా అడగకపోవడం విక్రమ్ కు వింతగా తోస్తోంది. విక్రమ్ అవస్థను గమనించి తనలో తానే నవ్వుకుంది హర్షిత.
'ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్?' అంటూ పలకరించింది విక్రమ్ తండ్రి రామారావుని.
'బాగానే ఉందమ్మా...అమ్మ నాన్నవాళ్ళు ఎలా ఉన్నారు?' అన్నాడు.
మాట్లాడుకుంటూండగానే విక్రమ్ వచ్చాడు. తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ, విక్రమ్ ను చూసింది హర్షిత.
ఇంకా అలా ఆలోచనలోనే ఉన్నాడు. అతన్ని అలా చూడగానే హర్షిత పెదాలపై చిరునవ్వు విరిసింది. ఇంకా ఆట పట్టిద్దామని...'ఫ్రెష్ అయ్యి వస్తా అంకుల్. వచ్చాక మీకో గుడ్ న్యూస్' అంది.
పొలమారింది విక్రమ్ కి. అసలేం జరుగుతోంది? ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ ఎవరనుకుంటున్నారు? కొంపతీసి తన భార్య అని అనుకోవడం లేదు కదా?..
వచ్చి తండ్రి వద్ద కూర్చున్నాడు.
'ఏరా..ఎలా ఉంది నీ ఉద్యోగం? అందరూ సఖ్యతగానే ఉంటున్నారు కదా?' అని అడిగాడు రామారావు
'అంతా బాగానే ఉంది నాన్నా..' అన్నాడు కానీ తను ఆ అమ్మాయి గురించి తన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో అడగాలని అనుకుంటూ కూడా అడగలేకపోతున్నాడు.
'చిక్కిపోయావురా...సరిగ్గా తినడం లేదా?' విక్రమ్ తలపై చేయివేసి ప్రేమగా నిమురుతూ అడిగింది తల్లి.
'అబ్బే..అదేం లేదమ్మా..బాగానే తింటున్నా...' అన్నాడు.
తన తల్లిని హర్షిత ఎవరనుకుంటున్నారోనన్న ఆందోళన విక్రమ్ తలను తొలిచేస్తోంది.
'అమ్మా...తను...'
'..మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా...నీ ఉద్యోగం జాగ్రత్త..అప్పుడప్పుడు నువ్వు వస్తూనే ఉన్నావు కదరా..మాకేం బెంగ లేదు..' అంది తల్లి జానకమ్మ.
ఏం మాట్లాడలేకపోయాడు విక్రమ్. రైలులో హర్షిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన తల్లిదండ్రుల కోసం చేస్తున్న ఉద్యోగం వదిలి వచ్చేసింది హర్షిత. తానేమో ఎక్కడో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను చూడటానికి అప్పుడప్పుడూ వస్తున్నాడు. '..మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా...నీ ఉద్యోగం జాగ్రత్త..' అంటూ తన తల్లి ఇప్పుడన్న మాటలు గుర్తుకువచ్చాయి. తన తల్లి వంక ప్రేమగా చూశాడు.
ఫ్రెష్ అయ్యి వచ్చింది హర్షిత.
హర్షితను చూడగానే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు విక్రమ్.
విక్రమ్ అవస్థను చూసి లోలోపల నవ్వుకుంటూనే విక్రమ్ తల్లి దగ్గరకు వచ్చి ఆమె భుజాలపై చేతులేసి కౌగిలించుకుని, ఆమె వెనకనుంచి విక్రమ్ ను చూస్తూ కళ్ళెగరేసింది హర్షిత.
అంతా అయోమయంగా ఉంది విక్రమ్ కి. అసలు హర్షిత ఎవరనుకుంటున్నారు తన తల్లిదండ్రులు?
'అమ్మా...తను....'
'ముందు భోజనం చేసేయండిరా..తర్వాత మాట్లాడుకుందాం...ఎప్పుడు తిన్నారో ఏంటో...?' అన్నాడు విక్రమ్ తండ్రి రామారావు.
'మీరు కూడా వచ్చేయండి..అందరం కలిసి తిందాం..' అంది విక్రమ్ తల్లి జానకమ్మ.
భోజనాలయ్యాయి. హర్షిత, విక్రమ్ తల్లిదండ్రులు ఏవేవో మాట్లాడుకుంటుంటే వింటూ తాను ఏం మాట్లాడకుండా భోజనం ముగించాడు విక్రమ్.
అందరూ వచ్చి హాలులో కూర్చున్నారు. ఇక విక్రమ్ అవస్థకు చెక్ పెట్టేద్దామనుకుంది హర్షిత.
'అప్పుడు మీరు మా ఊరు వచ్చినప్పుడు ఈసారి గుమ్మడి ఒడియాలు పెడదాం అనుకున్నారు కదా...నేను కూడా వస్తా అన్నా...నన్ను పిలవకుండానే గుమ్మడి ఒడియాలు పెట్టేసారా ఆంటీ?..' అంది.
ఒక్కసారిగా విక్రమ్ మనస్సులో ప్రశాంతత ఆవరించింది. హమ్మయ్య..అయితే వీళ్ళకి ముందే ఒకరంటే ఒకరికి పరిచయం ఉందనమాట...అలా మనసులో అనుకోగానే విక్రమ్ పెదాలపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది.
అంతా గమనిస్తూనే ఉంది హర్షిత.
'అబ్బే...ఏం పెట్టలేదే...నువ్ రాకుండా నేనొక్కదాన్నీ పెట్టగలనా?'... అంది జానకమ్మ. హర్షిత అలా అడగడంలో అసలు కారణం తెలియని విక్రమ్ తల్లి.
'పోన్లేండి ఆంటీ...ఇహ నేను వచ్చేసాను కదా...పెడదాం..' ఓరకంట విక్రమ్ ను చూస్తూ అంది హర్షిత.
'మీకు ఒకరంటే ఒకరికి ముందే పరిచయం ఉందన్నమాట'...ఉండబట్టలేక అన్నాడు విక్రమ్.
కిలకిలా నవ్వేసింది హర్షిత. 'అదాంటీ మీ అబ్బాయి టెన్షన్...ఇందాకటి నుంచి మీరు నన్ను ఎవరనుకుంటున్నారా? అని తెగ టెన్షన్ పడిపోతున్నాడు..' అంది.
'అవునురా..పక్క ఊరిలో మొన్నామధ్య ఏదో ఫంక్షన్ కి వెళ్ళాములే మన పక్కింటోళ్ళు నేను..అప్పుడు పరిచయం..ఒక రెండుమూడు సార్లు కలిసాములే..చాలా మంచి పిల్ల'...కితాబిచ్చింది జానకమ్మ.
తేలిక పడింది విక్రమ్ మనస్సు.
అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు. ఇందాక తాను గుడ్ న్యూస్ చెబుతానన్న విషయం గురించి చెబుతూ తాను జాబ్ మానేసిన విషయం, ఇక అమ్మా నాన్నల దగ్గరే ఉండబోతున్న విషయం చెప్పింది హర్షిత.
హర్షిత అలా చెబుతున్నప్పుడు తన తల్లిదండ్రుల కళ్ళలో మెరుపును గమనించాడు విక్రమ్.
అందరూ నిద్రకు ఉపక్రమించారు. విక్రమ్ తానూ పడుకున్నాడు కానీ, మనసులో ఏవో ఆలోచనలు పరుగెడుతున్నాయి.
తెల్లవారింది..
స్నానాలు, టిఫిన్లు అయ్యాక హర్షిత అంది...'ఆంటీ నేను వెళ్ళొస్తాను మరి..అమ్మావాళ్ళు కంగారుపడుతుంటారు. రాత్రి ఫోన్ చేసి చెప్పాననుకోండి. కానీ ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అని ఎదురుచూస్తున్న అమ్మానాన్నలను త్వరగా కలుసుకోవాలి' అంది.
ఇప్పటివరకూ చిలిపిగా ఆటపట్టించేలా సరదాగా గలగలా మాట్లాడే హర్షిత ఆ మాటలంటున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది విక్రమ్ కి. ఆ మాటల్లో చెప్పలేని ఆప్యాయత ఉంది..ఆరాధన ఉంది. విడదీయలేని బంధం ఉంది.
'జాగ్రత్తగా వెళ్ళిరా తల్లీ...ఇక్కడే ఉంటావు కాబట్టి మళ్ళీ వచ్చెయ్...మా వాడు మళ్ళీ ఊరు వెళితే మీ అంకుల్ కి నాకు ఏం తోచదు..నువ్వుంటే సరదాగా ఉంటుంది వాతావరణం...' అంది విక్రమ్ తల్లి జానకమ్మ.
హర్షిత మాటలు, తన తల్లి మాటలు పదే పదే మనసులో మార్మోగుతున్నాయి విక్రమ్ కి.
'మీరంతలా చెప్పాలా ఆంటీ...పొద్దున్న టిఫిన్ మా ఇంట్లో..భోజనం మీ ఇంట్లో..డిన్నర్ మళ్ళీ మా ఇంట్లో...' కిలకిలా నవ్వుతూ అంది హర్షిత.
హర్షిత కబుర్లకు మురిసిపోతున్న తల్లిదండ్రులను చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు విక్రమ్.
హర్షితను వాళ్ళ ఇంటిలో దింపి వచ్చాడు విక్రమ్. హర్షిత వాళ్ళ ఇంటిలో కూడా తన పట్ల వారు చూపించిన ఆప్యాయతకు ముగ్దుడయ్యాడు విక్రమ్.
హర్షితను దించేసి ఇంటికి తిరిగివచ్చాడు.
తాను ఉండగానే ఒకటి రెండుసార్లు ఇంటికి వచ్చివెళ్ళింది హర్షిత. హర్షిత ఎప్పుడు వచ్చినా, తిరిగి వెళ్ళేటప్పుడు తానే వాళ్ళ ఇంటిలో దించి వస్తున్నాడు.
ఆఫీసులో తాను తీసుకున్న శెలవులు అయిపోయాయి. తిరిగి ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్న విక్రమ్ తన తల్లిదండ్రల వైపు చూశాడు.
'జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా...మా గురించేం దిగులు చెందకు...ఈ పిల్ల అప్పుడప్పుడూ వచ్చిపోతూనే ఉంటుందిగా...మాకూ కాలాక్షేపంగా ఉంటుంది...' అంటోంది విక్రమ్ తల్లి జానకమ్మ.
'ఉద్యోగం జాగ్రత్తరా...ఎవరితోనూ తగవులు వద్దు..నీ పనులు నువ్ చూసుకో..ఎవరి విషయాలలో కలుగజేసుకోకు..' జాగ్రత్తలు చెబుతున్నాడు తండ్రి.
రైలు ఎక్కాడు విక్రమ్. మనసు నిండా తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు, హర్షిత మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. కొంత సమయం తర్వాత పెద్దగా నిట్టూర్చాడు. ఏదో నిశ్చయించుకున్నవాడిలా మనసు తేలికపడింది. బయటకు చూస్తూ హర్షిత కబుర్లు, చిన్నపిల్లలా చేసే అల్లరి గుర్తు చేసుకుంటున్న విక్రమ్ పెదాలపై చిరునవ్వు.
------
కొద్ది రోజులు గడిచాయి.
ఒకనాటి ఉదయం హఠాత్తుగా తమ ఇంటిముందు ప్రత్యక్షమైన కొడుకును చూసిన రామారావు, జానకమ్మ ఒక్కసారిగా కంగారు పడ్డారు.
'ఏమైందిరా కన్నా?..అంతా ఓకేనా?..' కొడుకును లోపలకు తీసుకువెళుతూ అడిగారు.
'ఏం లేదమ్మా...కంగారు పడాల్సిందేమీ లేదు..ఇక్కడకు దగ్గరలో ఉన్న ఆఫీసులో జాబ్ కు అప్లయి చేశాను. జాబ్ వచ్చింది..అక్కడి నుంచి వచ్చేసా' అన్నాడు విక్రమ్.
తన తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషంతోపాటు ఆదుర్దాను గమనించాడు.
'అమ్మా....నేను అక్కడ చేసినా, ఇక్కడ చేసినా జాబ్ జాబే..పైగా ఇక్కడ నాకు సాలరీ పెరిగే అవకాశం కూడా ఉంది...అన్నిటికీ మించి మీ దగ్గరగా..మీతో కలిసి ఉండే అవకాశం...మనందరం కలిసి ఉండే అవకాశం లభించిందమ్మా..అందుకే వెంటనే అక్కడ జాబ్ మానేస్తాను అని మేనేజర్ కి చెప్పి వచ్చేసానమ్మా..మా మేనేజర్ కూడా పెర్సనల్ గా ఎంతో సంతోషించాడు తెలుసా? తల్లిదండ్రులతో కలిసి ఉండాలన్న నీ ఆలోచన బాగుంది విక్రమ్ అంటూ పొగిడారు తెలుసా?....' చెప్పుకుంటూ పోతున్నాడు విక్రమ్.
'అమ్మా...నాలో ఈ మార్పును తీసుకువచ్చింది ఎవరో తెలుసా? మన హర్షిత. ఉద్యోగాల పేరుతో చిన్ననాటి నుంచి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వదిలి ఎక్కడో ఉండటం సరికాదంటూ, తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తన తల్లిదండ్రుల కోసం వచ్చేసింది. పెద్ద వయసులో పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురుచూసే తల్లిదండ్రులు, ఆ ఆత్మీయతలు, అనుబంధాలను ఉద్యోగాల పేరుతో నేడు ఎందరో దూరం చేసుకుంటున్నారమ్మా...ఇంతకాలం నేనేం కోల్పోయానో హర్షిత నాకు తెలిసేలా చేసిందమ్మా..నెలలో కేవలం రెండు మూడు రోజులు నేను వస్తానని, నా కోసం నెలంతా ఎదురుచూస్తున్న నా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ప్రేమను, అనురాగాన్ని, ఆత్మీయ బంధాన్ని నాకు తిరిగి కొత్తగా చూపించిందమ్మా...'
ఏదో తెలీని ఉద్వేగంతో చెప్పుకుంటూ పోతున్న విక్రమ్ కళ్ళవెంట దారలా కారుతున్న కన్నీరు బుగ్గలను తడిపేస్తోంది.
'అయ్యో...ఊరుకో నాన్నా...ఊరుకో కన్నా...నువ్వెక్కడున్నా మాముందే ఉన్నట్టుంటుందిరా...మాకెప్పుడూ నువ్ దూరం కాలేదురా...అయ్యో..ఊరుకో నాన్నా...' వీపును సవరిస్తూ, బుగ్గలపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ, సముదాయిస్తున్న తల్లిదండ్రుల కళ్ళలో కన్నీరు.
ఇంటి గుమ్మం వద్దకు వస్తూ తలెత్తి చూశాడు విక్రమ్. ఎదురుగా హర్షిత.
అభనందిస్తున్న కళ్ళతో విక్రమ్ చేతిలోని బ్యాగులను అందుకుంది.
హర్షితను కృతజ్ఞతగా చూశాడు విక్రమ్.
-0-0-0-0-