Friday, September 10, 2021

అనుబంధాలు (Anubandhaalu)

 

ఏవండీ....మనవాడు పొద్దున్నించీ కనిపించడం లేదండీ...’

తీరిగ్గా కూచుని న్యూస్ పేపర్ తిరగేస్తున్న భర్త రాజారాం దగ్గరకు కంగారుగా వస్తూ చెప్పింది భార్య మంగతాయారు.

పొద్దున్నించీ కనిపించకపోవడం ఏమిటీ ? సరిగ్గా చూశావా ?’ చేతిలోని పేపర్ ని వెంటనే టేబుల్ పై పెట్టేస్తూ లేచాడు రాజారాం.

ఉదయం నేను వంటగదిలో ఉండగా వచ్చాడు..ఆకలేస్తోందా నాన్నా అని కొన్ని బిస్కెట్లు, కొంచెం పాలు ఇచ్చాను. బిస్కట్లు తిని పాలు తాగేసి అక్కడే అలాగే చూస్తూ బజ్జున్నాడు. నేను వంట పనిలో నిమగ్నమయ్యాను. కొంచెం సేపయ్యాక వెనక్కు తిరిగి చూస్తే అక్కడ లేడు. లోపలికి వచ్చి పిలిచినా పలకడం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏమిటో ?’ చంటిబిడ్డ కనిపించకపోతే తల్లడిల్లిపోతున్న తల్లిలా తన భార్య మంగతాయారు పడుతున్న ఆందోళన చూస్తున్న రాజారాం పెదాలపైన చిన్న దరహాసం.

ఆదుర్దాగా అటూ ఇటూ చూస్తున్న మంగతయారు భర్త మోములోని చిరు దరహాసాన్ని గమనించి చిన్నబుచ్చుకుంది.

-----

రాజారాం పోస్టాపీసులో పోస్టుమాన్ గా చేసి రిటైర్ అయ్యారు. పెద్ద సొంతిల్లు. ఒక్కడే కొడుకు. ఉద్యోగంలో ఉండగానే కొడుక్కి బంధువులమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేశారు. కొడుకూ కోడలూ వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రాజారాంకి ఎంతో ఖాళీ సమయం దొరికినంతలా ఉంది. ఏం తోచక భార్యను బలవంతంగా దగ్గర కూర్చోబెట్టుకుని తన ఆఫీసు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాడు. భార్య మంగతాయారుకు భర్త సమస్య అర్ధమయ్యింది. అతనికి ఏదో ఒక వ్యాపకం ఉంటే బాగుణ్ణు అనుకునేది. టీవీలో కార్యక్రమాలు చూడటం కంటే టీవీనే లేదనుకుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందనే భావనే ఇద్దరిదీ. ఒకరోజు సాయంత్రం వేళ గుమ్మం దగ్గర కూర్చుని భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో గేటు వద్దకు వచ్చి గేటు సందులలోంచి లోపలికి వద్దామనుకుంటున్న చిన్న కుక్కపిల్ల వాళ్ళ కంట పడింది. చాలా బుజ్జిగా, ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్ల ఆ చిన్న గేటు సందులలోంచి లోపలికి రావాలని చేస్తున్న ప్రయత్నం వారిద్దరికీ చూడముచ్చటేసింది.

వారి వీధిలో కొన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి కంట్లో ఈ చిన్నది పడితే ఏమన్నా చేస్తాయేమోనన్న ఆలోచన మంగతాయారును కలవరపెట్టింది. వెంటనే మంగతాయారు దాన్ని ఎత్తుకుని తన వెనకే వచ్చిన భర్త రాజారాంకి చూపించింది. మంగతాయారు చేతిలో బుజ్జిగా చిన్ని చిన్ని రేగిపండులాంటి కళ్ళతో మిణుకు మిణుకు మంటూ చూస్తున్న ఆ చిన్న కుక్కపిల్ల ఇద్దరి మనసులనూ కొల్లగొట్టింది. ఆ క్షణం నుంచీ ఆ ఇంటి సభ్యుడుగా మారిపోయింది. టామీ అని నామకరణం చేశారు.

టామీ వచ్చిన దగ్గరనుంచీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ రాజారాంకి మహా కాలక్షేపంగా ఉంటోంది. అది చూసి భార్య మంగతాయారు చాలా సంతోషించింది.

------

ఎందుకండీ ! నవ్వుతున్నారు !’ మూతి చిన్నగా ముడుచుకుంటూ, భర్త వైపు చూస్తూ అంది మంగతాయారు.

అబ్బే ! నవ్వడం లేదే ! వాడంటే నీకు చాలా ప్రేమ అని..’ అనునయిస్తూ అన్నాడు రాజారాం.

పోదురూ బడాయి..అక్కడికేదో మీకు ప్రేమ లేనట్టు..కనపడటం లేదని చెప్పగానే అన్నీ మర్చిపోయి నిల్చుండిపోలా?’ చిరు కోపం ప్రదర్శిస్తూ అంది మంగతాయారు.

అవుననుకో...మనకు వాడు...వాడికి మనం...ఇంతకీ ఎక్కడున్నాడో ? ఇల్లంతా వెతికావా ?’ అడిగాడు రాజారాం.

లేదండీ... పిలిచినా రాలేదు, మీ దగ్గరకు వచ్చాడేమో అనుకున్నా...’

సరే...వాడికీ మొక్కలంటే నాలానే మహా ఇష్టం...ఏ మొక్క దగ్గరున్నాడో..’

గేటు దగ్గర అటూ ఇటూ ఉన్న మొక్కలలో దేని వెనకో పడే ప్రయత్నం చేస్తూ కనిపించాడు ఒక ఏడాది వయసున్న టామీ.

ఏరా...అమ్మకు చెప్పకుండా అలా వెళ్ళిపోవడమేనా ? ఎంత కంగారుపడిపోయానో తెలుసా ?’

టామీ కనిపించగానే సర్వస్వం మరిచిపోయి వెంటనే వెళ్ళి చిన్నపిల్లాడిని హత్తుకున్నట్లు గుండెలకు హత్తుకుని మంగతాయారు చిన్నగా మందలిస్తోంది.

టామీ పట్ల తాను, తన భార్య పెంచుకున్న ప్రేమ, ఆ జంతువు తమపై చూపిస్తున్న ప్రేమ...ఏ జన్మ బంధమో అనుకున్నాడు రాజారాం.

------

కొడుకు మోహన్ డిగ్రీ దాకా చదువుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ పట్టణంలో ఏదో కంప్యూటర్ జాబు చేస్తున్నారు.

ఆఫీసుకు దగ్గరగా ఉండాలి అనే వంకతో అలా మనకు దూరంగా ఉంటున్నారు‘ అంటూ అప్పుడప్పుడూ భార్య మంగతాయారు కొడుకు గురించి తన దగ్గర చెప్పుకుని బాధపడుతుండటం రాజారావుకు పరిపాటే.

వారి జీవితం...వారికి ఎలా నచ్చితే అలా...మనం అర్ధం చేసుకోవాలి. అంతే..బిడ్డలకు బంధంగా నిలవాలి కానీ భారంగా మారకూడదు..అప్పుడే మనకు గౌరవం..రోజులు అలా ఉన్నాయి...’

భర్త మాటలకు ఇంకేం మాట్లాడలేక, భర్త కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంటుంది మంగతాయారు.

-----

ఎందుకోగానీ..రెండు రోజులుగా టామీ అన్నం తినడం లేదు. చిరుతిండ్లు తిన్నా అన్నం తినకపోతే నీరసించిపోతుందేమోనన్న బెంగ మంగతాయారుకు పట్టుకుంది. దగ్గరలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఒకసారి చూపిస్తే మంచిదన్న ఆలోచన భార్యాభర్తలకు కలిగింది. ముందురోజు సాయంత్రం రాజారాం ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి సమయాలు కనుక్కుని, తమ టామీ పరిస్థితిని డాక్టరుకు చెప్పి, ఒకసారి తీసుకురండి చూద్దాం అనడంతో మరుసటిరోజు ఉదయం తీసుకువెళ్ళారు. టామీనీ పరీక్షించిన డాక్టరు సమస్య ఏమీ లేదని, ఆకలి మందగించడం వల్లనే తినడం లేదనీ, చిరుతిండ్లు తగ్గించి, అన్నం ఎక్కువ తినేలా చూడాలని చెప్పాడు. రెగ్యులర్ గా చేయవలసిన ఇంజక్షన్ డోసేజీ చేసి పంపించాడు. ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది.

ఇంటికి వచ్చేసరికి ఎదురుగా కొడుకూ, కోడలూ.

వారిని అలా చూడగానే రాజారాం, మంగతయారులు కంగారు పడ్డారు.

ఏమ్మా అంతా కులాసాయేనా ? ఫోను చేయాల్సింది కదరా, ఇంట్లోనే ఉండేవాళ్ళం..’ అంత సడెన్ గా ఎందుకొచ్చారా అనే కంగారు ఆమె మాటలలో తొంగిచూస్తోంది.

ఈలోపున రాజారాం తలుపు తాళం తీయడంతో అందరూ లోపలికి వచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుని కూర్చున్నారు. కోడలు మానస అత్తగారితోపాటు వంటింటిలోకి వెళ్ళింది.

ఏం నాన్నా...అమ్మకీ, మీకూ ఆరోగ్యం ఎలా ఉంటోంది ?’

కొడుకు అడిగిన ప్రశ్నకు రాజారాం కళ్ళు మెరిసాయి. పెద్దవాళ్ళయిన తల్లిదండ్రులు తమ బిడ్డల నుంచీ కోరుకునేది డబ్బూ దస్కాలూ కాదు...ఇటువంటి ఆప్యాయతతో కూడిన మాటలే కదా అనుకున్నాడు.

ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉన్న తండ్రిని చూసి ఒకింత ఆందోళనతో మోహన్ మళ్ళీ అదే ప్రశ్న రెట్టించాడు.

......ఇద్దరం బాగానే ఉన్నాం రా...ఇదిగో వీడికి కొంచెం నలతగా ఉందేమోనని ఆసుపత్రికి తీసుకువెళ్ళాం..ఇంజెక్షన్లు కూడా చేయించాల్సి ఉంది కదా..’

మీ ఆరోగ్యం జాగ్రత్త...వాడికేం కాదు..వాడి ఆలోచనలతో మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు...’

అయ్యో...అదేం లేదురా...శుభ్రంగా తింటున్నాం..ఉంటున్నాం...ఒంటరిగా ఉన్నామనే ఆలోచన రాకుండా ఈ టామీ గాడు రోజంతా ఏదో అల్లరి చేస్తూ సందడి చేస్తున్నాడు..వీడి సందడితో మాకు మా గురించిన ఆలోచనలేం ఉండటం లేదురా...ఉదయం నుంచీ రాత్రి పడుకోబోయేవరకూ వీడితో కాలక్షేపం సరిపోతోంది..’

అదేంటి నాన్నా...మేం లేమా...ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన ఎందుకు ? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గరకి రావచ్చన్నా కదా ?’

అవుననుకో...ఉదయం నుంచీ రాత్రి వరకూ మీరు ఆఫీసుల్లో గొడ్డు చాకిరీ చేసి వచ్చి, ఇంట్లో మళ్ళీ మాకు చాకిరీ చేయాలంటే ఇబ్బందే కదరా..మీకు అడ్డుగా మేం ఎందుకులే అని..అయినా...మీరు ఇలా అప్పుడప్పుడు వచ్చి మమ్మ ల్ని చూసి వెళ్తున్నారాయే..ఇంకేం కావాలి ?’

తండ్రి మాటలు తన హృదయాన్ని ఎక్కడో తాకుతున్న అనుభూతి మోహన్ కు కలుగుతోంది. మొగుడు పెళ్ళాలు, ప్రైవసీలు, సంపాదనలు...ఇలా రకరకాల కారణాలు...కారణం ఏదైతేనేమి...కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు...పెళ్ళయ్యాక పరాయివాళ్ళవుతున్నారు.

ఏదో అలా చెప్పుకుంటూ పోతున్న రాజారావు కొడుకు ముఖం చూసి ఒక్క క్షణం ఆగాడు..

ఏరా కన్నా...మీకిద్దరికీ ఆరోగ్యం ఎలా ఉంది ? ఇద్దరూ కలివిడిగానే ఉంటున్నారు కదా ! ఎట్టి పరిస్థితిలోనూ అమ్మాయి మనసు కష్టపెట్టకురా కన్నా...నిన్ను నమ్మి వచ్చింది. జాగ్రత్తగా చూసుకో..ఒకవేళ ఏదైనా మాట అన్నదనుకో...నీ బిడ్డ ఒకమాట అంది అనుకో, అంతేకానీ తిరగబడకు. సరేనా..మీరు ఆనందంగా ఉంటేనే కదరా పెద్దవాళ్ళుగా మాకు సంతోషం. మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది..’

అప్పుడే హాలులోకి వస్తున్న మానస చెవిన మామగారి మాటలు పడ్డాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘మామయ్యా...కాఫీ...కొంచెం సేపట్లో భోజనం సిద్ధమవుతుంది. ఆరోగ్యం ఎలా ఉంది మామయ్యా’ చేతిలో కాఫీ కప్పు పెడుతూ వంగి కాళ్ళకు దణ్ణం పెట్టుకుని పక్కనే కూర్చుంది.

ఆమె కళ్ళలో నీళ్ళు చూసిన రాజారాం కంగారు పడ్డాడు.

ఏమ్మా...ఆ కళ్ళలో నీళ్ళేంటి తల్లీ ? మావాడేమన్నా అన్నాడా ?...’

అబ్బే అదేం లేదు మామయ్యా...కంగారు పడకండి...అలాంటిదేమీ లేదు. మీ అబ్బాయిది మీ పెంపకం..ఎన్నడూ కూడా భార్య పట్ల దురుసుగా ప్రవర్తించే రకం కాదు..కానీ...నేనే అప్పుడప్పుడూ కొంచెం అలిగి..తనని బాధపెడుతుంటాను..’

మీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమగా అన్యోన్యంగా, ఆనందంగా ఉండాలి తల్లీ..మాకు మీ సంతోషమే ముఖ్యం..మీరు ఆనందంగా ఉంటేనే కదా మాకు సంతోషం..’

నన్ను క్షమించండి మామయ్యా...ఉద్యోగం కారణంగా మేము మీకు దూరంగా ఉండటం మాకూ ఇష్టం ఉండటం లేదు. కోడలు వచ్చింది కొడుకును దూరం చేసిందన్న అపవాదు నాకొద్దు. మనందరం కలిసుందాం, ఇక్కడకు తీసుకువచ్చేయండి అంటూ రోజూ మీ అబ్బాయికి చెబుతూనే ఉన్నా..’

అయ్యో తల్లీ...అలా ఎందుకనుకుంటావు ? అయినా, మీరేం ఎక్కడో అమెరికాలోనో, లండన్ లోనో లేరు కదా...అరగంట ప్రయాణం. అయినా, ఇక్కడ మాకు లోటేముంది ? ఏదో ఒకటి చేసుకు తింటున్నాం..రోజంతా సందడి చేసేందుకు వీడున్నాడు..’ తనకు దగ్గరగా ప్రశాంతంగా బజ్జుని చూస్తున్న టామీని చూపిస్తూ అన్నాడు రాజారాం.

కానీ ...మామయ్యా...మీరు కూడా మా దగ్గరకి వచ్చేస్తే బాగుంటుంది కదా అనీ...’

మాకు ఎప్పుడైనా అలా మిమ్మల్ని చూడాలన్నప్పుడు వస్తూనే ఉన్నాం కదమ్మా...అయినా మీకు సెలవులుండాలి..ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ ఆఫీసులోనే కదా..ఎప్పుడో పొద్దున్న వెళితే రాత్రికి గానీ రారాయే..అక్కడైనా, ఇక్కడైనా మేమిద్దరమే కదా..ఇక్కడైతే అలవాటు పడిన వాతావరణం..అన్నింటికీ మించి ఇదిగో వీడూ వీడి సందడీ. వీడితో కాలక్షేపంతో ఇక్కడైతే సమయం తెలియట్లేదమ్మా..ఇంకా మీ అత్తయ్య మీరిద్దరూ వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తే బాగుండు అనుకుంటోంది. సెలవు దొరికి మీకు వీలయినప్పుడల్లా ఒకసారి మమ్మల్ని చూసి వెళుతూ ఉంటే మాకూ అదో సంతోషం...’

కొడుకు, కోడలికి తాము భారం కాకూడదన్న తన భర్త ఆలోచనను అతని మాటల్లో మంగతాయారు గమనిస్తోంది.

భోజనాలు చేశాక, ఏదో పని ఉందంటూ కొడుకూ కోడలూ తిరిగి ప్రయాణమయ్యారు. గేటు వరకూ వెళ్ళాక మోహన్ ఒక్క ఉదుటున వెనక్కి వచ్చి టామీని ఎత్తుకుని గుండెలకు బలంగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా అందరిలో ఏదో తెలియని ఉద్వేగం. మోహన్ భార్య మానస వచ్చి భర్త భుజం, వీపు నిమిరింది.

తేరుకున్న మోహన్ టామీని ముద్దు పెట్టుకుని, ‘అమ్మా, నాన్నా... వెళ్ళొస్తాం, మళ్ళీ వీలు చూసుకుని వస్తాం’ అంటూ బయలుదేరారు.

కనుచూపు మేర వరకూ కొడుకూ కోడలూ వెళ్ళిపోయాక, రాజారాం, మంగతాయారూ గేటు వేసి వెనుదిరిగారు. తన కొడుకు వెళ్ళేవాడల్లా అలా వెనక్కు వచ్చి టామీని హత్తుకున్న వైనం గురించి మంగతాయారుకు ఏమీ అర్ధం కాలేదు. భర్తను అదే విషయం అడిగితే, చిరునవ్వు చిందించి లోపలకు దారితీసాడు. రాజారాం చేతులు చాచగానే ఎగిరి చంకనెక్కిన టామీని విడ్డూరంగా చూస్తూ భర్త వెనకే నడిచింది మంగతాయారు.



-----

No comments: