Monday, February 5, 2018

Wall Hangings తో....ఇల్లే నందనవనము...(wall hangings tho ille nandana vanamu...)

అందమైన వెన్నెల రాత్రులు... చుట్టూరా పూలమొక్కలు.... ఆ చల్లని గాలికి సువాసన సొబగులద్దే లతలు... మనసు దోచుకున్న మనుషులు... ఇది ఒకప్పుడు కేవలం సినిమాకే కాదు, సాధారణ ్రపజానీకం కూడా అనుభవించిన సుందర వాతావరణం.  సొంతిల్లు ఉందీ అంటే, చిన్న ఇల్లయినా, పెద్ద ఇల్లయినా ఇంటి చుట్టూరా, డాబాపైనా కూడా మొక్కలు, చెట్లు, లతలు ఖచ్చితంగా ఉండాల్సిందే...‘అందమైన వెన్నెలలోనా...’, ‘మల్లెలు పూసే, వెన్నెల కాసే...’ అనుకుంటా ఎంతో ఆనందంగా గడిపేవారు ఒకప్పుడు.. పందిర్లు వేసి మల్లె, శంఖం తదితర తీగలు పాకించేవారు. సాయంత్రం, రాత్రి సమయాలలో ఒక వైపు చిన్న గది, ముందు వరండా మాదిరిగా ఉండే డాబాపై ఆ మొక్కల మధ్య, ఆహ్లాదకరమైన, పరిమళభరితమైన, ప్రశాంతమైన వాతావరణంలో కాలాక్షేపం చేసేవారు. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకూ ఉదయం నుండీ రాత్రి వరకూ ఇంట్లో ఉన్నారంటే మొక్కల మధ్య ఉంటేనే కాలాక్షేపం అనే రీతిన అప్పటి రోజులు ఉండేవి. అంతేకాకుండా బొప్పాయి, జామ వంటివాటితోపాటు కొబ్బరి, మామిడి చెట్లను కూడా తమ ఇంటి ప్రాంగణంలో తప్పనిసరి మొక్కల జాబితాలో చేర్చేవారు.
అయితే రానురాను మనుషుల మనసులు స్వార్థపూరితంగా మారాయి. కాస్త నీరు పోస్తే చాలు చల్లటి వాతావరణం, పూలు, పండ్లు అందించే మొక్కలు పెంచడానికి కూడా తమ యావదాస్తి రాసివ్వాలేమో అన్నట్లు ప్రవర్తిస్తున్నవారి సంఖ్య అధికమవుతుండటం దురదృష్టకరం. ఇంటి ముందు, ఇంటి ఆవరణలో సైతం ఒక్క మొక్క కూడా లేకుండా మొత్తం కాంక్రీటు మయం చేస్తున్నవారు ఎందరో ...
మరోవైపు అపార్ట్ మెంట్ సంస్కృతి పెరగడంతో మొక్కల పెంపకానికి స్థలాభావం ఎదురవుతుండటంతో కొంతమంది మొక్కల పెంపకంపై అభిమానం ఉన్నవారు కూడా మొక్కలు పెంచుకోవడానికి లేదే అని ఢీలా పడుతున్నారు. అయితే అటువంటి పరిస్థితులలో ఇంట్లో మొక్కలు పెంచుకునేందుకు వీలు కలిగించే వాల్ హ్యాంగింగ్స్ పలువురికి ఒక మంచి మార్గంగా కనిపిస్తున్నాయి. ఇంటికే అందాన్నిచ్చే మొక్కలను పలువురు వాల్ హ్యాంగింగ్స్ సహాయంతో పెంచుకుంటూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ఆరోగ్యకర వాతావరణాన్నీ రూపొందించుకుంటున్నారు.
ఇదివరకటిలా పెద్ద పెద్ద లోగిళ్ళు లేకపోవడం, కొంచెం స్థలం కూడా మొక్కల పెంపకానికి వదలకుండా కాంపౌండ్ వాల్ ను అంటిపెట్టుకుని మరీ గదులు నిర్మించేస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో వాల్ హ్యాంగింగ్స్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మొక్కలను పెంచుకోవడానికి వాల్ హ్యాంగింగ్స్ ఉపయుక్తంగా ఉండటంతో ఆధరణ పెరుగుతోంది.
వాల్ హ్యాంగింగ్స్లో అడుగు మొదలు మూడడుగుల వరకు వెడల్పయిన కుండీలు లభ్యమవుతున్నాయి. అందమైన డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న వీటిలో ఆకర్షణీయమైన వివిధ రకాల పువ్వులు, అలంకరణ మొక్కలు వేస్తే ఆ అందమే వేరంటూ మొక్కల ్రపియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుండీలలో కోకోపిట్ ను వినియోగించడం ద్వారా బరువు కూడా  ఎక్కువగా ఉండదు. వివిధ రంగులలో ప్లాస్టిక్ కుండీలతోపాటు మట్టితో తయారైన టెర్రకోట హ్యాంగింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో నేరుగా వేసుకోవడం గానీ లేదంటే మొక్కలను కొన్నప్పుడు ఉన్న ప్యాకెట్ తోపాటే ఉంచడం గానీ చేయవచ్చు... వీటిలో సీజనల్ గా వచ్చే మొక్కలతోపాటు బోన్సాయ్ వృక్షాలను కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా అలంకరణ మొక్కలతోపాటు పాదు (క్రీపర్స్) జాతికి చెందిన మొక్కలను పెంచుకోవచ్చు. ఇంటికి వేసిన రంగులతో సరిపోయే వివిధ రకాల అలంకరణ మొక్కలను కూడా హ్యాంగింగ్స్ లో పెంచడం ద్వారా ఇంటికి ఒక కొత్త అందాన్ని తీసుకురావచ్చనడంలో ఏమాత్రం సందేహం లేదు.



No comments: