Sunday, November 5, 2017

Aakulo Aakunai song from Meghasandesam Movie and interesting history behind it.

మేఘ సందేశం....తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా. సాహిత్యం పరంగా, సంగీతం పరంగా, పాటల పరంగా అప్పటి తెలుగు ప్రజలను అమితంగా ఆకట్టుకున్న సినిమా. ప్రతి పాట కూడా ఎంతో హృద్యంగా సాగిపోతూ వీక్షకులను ఓలలాడిస్తుంటుంది. ఆ సినిమాలో ‘ఆకులో ఆకునై..’ పాటకు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రకృతిని చూసి పులకరించిన ఒక గీత రచయిత మనసులోంచి ఆసువుగా జాలువారిన అక్షరాలు...ప్రకృతిని సైతం పులకరించిపోయేలా చేసిన ఈ గీతం...సాహిత్యం విషయంలో తెలుగు తేనెలొలికించింది. వింటున్నంతసేపు ప్రకృతి ఒడిలో మనం కూడా అలా సేదదీరితే ఎంతబాగుండు అనిపిస్తూ, హృద్యంగా సాగిపోతుంది. మహాగాయని పి.సుశీల గళం నుండి వెలువడిన పదాలు ఎంతో మధురంగా తెలుగు పరిమళాన్ని వెదజల్లుతూ,  ప్రకృతిలో మమేకమై సాగిపోయే మన వారి జీవన విధానాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. మనస్సులో ఎక్కడో అయ్యో మనం కూడా అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉంటే బాగుండు అనిపిస్తాయి.

ఇక ఈ గీతానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పరికిస్తే...ఈ పాట రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. పాటల రచయితగా దేవులపల్లికి ఇది తొలి పాట. 23 ఏళ్ళ వయసులో ఆయన విజయవాడ నుండి బళ్లారి వెళుతున్న సందర్భంలో ట్రైనులో ప్రయాణిస్తున్న సమయంలో...ఆ ట్రైను పచ్చని చెట్లతో, ఆహ్లాదకర వాతావరణం కలిగిన అడవి గుండా ప్రయాణిస్తున్న నేపథ్యంలో...ఆ సుందరమైన ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన దేవులపల్లి మదిలో మెదిలిన పద నాదం...ఈ గీతా పరిమళం. ఈ ఘటన 1923 లో జరిగింది.

కొంతమంది అనుకునే దానిని బట్టి ...1923 లో తన 23 ఏళ్ళ వయసులో దేవులపల్లి, పిఠాపురం దగ్గర ఉన్న తన గ్రామమైన చంద్రపాలెం నుండి ఎయిర్ మద్రాసులో ఒక పాట రికార్డింగ్ నిమిత్తం రైలులో ప్రయాణిస్తున్న సందర్భంలో...ఆ రైలు నల్లమల అడవి గుండా ప్రయాణం సాగిస్తోంది. ప్రకృతి సోయగంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణం చూసి ముగ్ధుడైన దేవులపల్లి మదిలో మెదిలిన భావాలకు అక్షర రూపమే ఈ పాట. ఈ పాట 1923 లో రాయడం జరిగితే, దాదాపు 40 సంవత్సరాల అనంతరం ‘మేఘ సందేశం’ సినిమాలో ఒక భాగమై, ప్రకృతి రమణీయతపై ప్రజలకు మరోసారి మక్కువ కలిగేలా చేసింది.

ఈ గీత రచన ఆంగ్లంలో రెండు సార్లు తర్జుమా చేయబడింది. ఒకసారి వి.ఎన్. భూషణ్ ద్వారా, మరోసారి ఆచంట జానకీరామ్ ద్వారా...ఇవి 1928లో త్రివేణి పత్రికలో ప్రచురించబడ్డాయి కూడా.

ఇక చిత్రం విషయానికి వస్తే....మేఘ సందేశం సినిమా 1984లో విడుదలైంది. అటు అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నిర్మాత, దర్శకుడు అయిన దాసరి నారాయణ రావుకు తమ సినీ జీవితంలో చిరస్మరణీయమైన చిత్రంగా నిలిచింది. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రతి పాటను అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. వేల పాటలతో ఎందరో శ్రోతల హృదయాలను గెలుచుకున్న గంధర్వ గాయని పి.సుశీల గొంతులోంచి వెలువడిన ఈ ‘ఆకులో ఆకునై’ పాట...ఆ సినిమాలో మాత్రమే కాక, సినిమా విషయం పెద్దగా తెలియని వారికి సైతం చిరపరిచయం. సినిమాతో పట్టింపు లేకుండా ప్రతిఒక్కరికీ చేరువైన సాహిత్య, గానసుమం.

No comments: