Monday, October 30, 2017

Telugu typing with apple keyboard layout everywhere

సాధారణంగా మనందరికీ తెలుగు టైపింగ్ అనగానే అను స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్ వేర్ ద్వారా యాపిల్ కీబోర్డ్ లే అవుట్ ను ఉపయోగించి తెలుగు టైప్ చేయడమే ఎక్కువగా పరిచయం. అయితే, ప్రస్తుతం అంతర్జాల వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో ఆన్ లైన్లో కూడా తెలుగు భాషా వినియోగం పెరిగింది. ఇంగ్లీషు అక్షరాలను ఉపయోగించి తెలుగు భావాన్ని వ్యక్తపరుస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అదేవిధంగా ఇంగ్లీషు అక్షరాలను వాడకుండా, తెలుగు అక్షరాలతోనే తెలుగులో భావాన్ని వ్యక్తపరిచేవారి సంఖ్య కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉండటం సంతోషకర విషయం.
పలు సైట్లలో తమ భావాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు పలువురు తెలుగు అక్షరాలతోనే అక్షరబద్ధం చేస్తుండటం చూడవచ్చు.

ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే...అను ద్వారా యాపిల్ కీ బోర్డ్ ను ఉపయోగించి మనం తెలుగులో టైప్ చేయాల్సివచ్చినపుడు ఆ కీబోర్డు లే అవుట్ వేరుగా ఉంటుంది. ఆ ఫాంట్స్ కూడా వేరు. వాటిని ట్రూ టైప్ మరియు పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ అంటారు.

అయితే అంతర్జాలంలో మనం ఉపయోగించే ఫాంట్స్ యూనికోడ్ ఫాంట్స్. ప్రస్తుతం యూనికోడ్ ఫాంట్స్ కూడా అను ఫాంట్స్ మాదిరిగానే అనేక ఫాంట్ స్టైల్స్ లో లభ్యమవుతున్నాయి. జీమెయిల్ వంటివాటిలో మనం డైరెక్టుగా ఎటువంటి సాఫ్ట్ వేర్ అవసరం లేకుండా భాషను మార్చుకోవడం ద్వారా తెలుగులో టైప్ చేయవచ్చు. ఇందులో మరో వెసులుబాటు ఏంటంటే మనం తెలుగులో టైప్ చేయడానికి అను స్క్రిప్ట్ మేనేజర్ లోని యాపిల్ కీబోర్డు లేఅవుట్ తరహా ఏ విధమైన లే అవుట్లను నేర్చుకోవాల్సిన పని లేకుండా, సులభంగా ఇంగ్లీషులో అనుకున్నది తెలుగులో టైప్ అయ్యేవిధంగా ఉండటంతో పలువురు ఈ తరహాలో తెలుగు టైప్ చేసేందుకు మక్కువ చూపడం జరుగుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, తెలుగులో టైప్ చేయాల్సిన అవసరం ఏర్పడినపుడు పలువురు యాపిల్ కీబోర్డ్ లే అవుట్ కంటే ఈ తరహా లే అవుట్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉదాహరణకు కిరణ్ అని టైప్ చేయాలంటే యాపిల్ కీబోర్డ్ లో అయితే jrkLH టైప్ చేయాల్సి వస్తుంది. అదే ఇపుడు నేను పేర్కొన్న విధంగా మెయిల్, ఇతర పనులలో ఉపయోగించే యూనికోడ్ ఫాంట్స్ ను టైప్ చేసేందుకు మామూలుగా ఇంగ్లీషులో kiraN టైప్ చేస్తే కిరణ్ వస్తుంది. దాంతో పలువురు ఈ తరహాగా తెలుగు టైప్ చేసేందుకే మక్కువ చూపుతున్నారు. అక్షరమాల వంటి సాఫ్ట్ వేర్లు ఈ తరహాలో తెలుగు టైప్ చేసేందుకు సహకరిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లు వాడకం విరివిగా పెరగడం, అందరికీ నెట్ అందుబాటులోకి రావడంతో అంతర్జాలంలో తెలుగు భాషా వినియోగం పెరిగింది. ఇదే తరహా లే అవుట్లు గల యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని పలువురు తెలుగులో టైప్ చేస్తున్నారు. మరికొన్ని యాప్ లు డైరెక్టుగా తెలుగు అక్షరాల కీబోర్డు నే అందిస్తున్నాయి. ‘తెలుగు మాట’ వంటి యాప్ లు డైరెక్టుగా తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ను ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే, అటు అను సాఫ్ట్ వేర్ ను అధికంగా వినియోగిస్తూ, ఆన్ లైన్ లోనూ తెలుగులో టైప్ చేయాల్సిన పని ఉన్న పలువురు ఈ తరహా వేర్వేరు కీ బోర్డ్ లేఅవుట్ల కారణంగా టైపింగ్ లో కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కారణం..కీల కాంబినేషన్లు వేర్వేరు కావడమే..ఉదాహరణకు కి అని టైప్ చేయాలంటే యాపిల్ లేఅవుట్లో jr టైప్ చేయాల్సివస్తే, యూనికోడ్ ఫాంట్స్ కోసం వాడే కొన్ని లేఅవుట్లలో అది ki గా ఉంటోంది.

అయితే యూనికోడ్ ఫాంట్స్ ని కూడా యాపిల్ కీ బోర్డ్ లేఅవుట్ లో టైప్ చేయవచ్చన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మనం అను స్క్రిప్ట్ మేనేజర్ లో తెలుగు కోసం వాడే యాపిల్ కీబోర్డు తరహా లే అవుట్ తోనే యూనికోడ్ ఫాంట్స్ ను టైప్ చేయవచ్చు. ఉదాహరణకు నేను ప్రస్తుతం ఆవిధంగానే ఈ బ్లాగులో తెలుగు టైపింగ్ చేస్తున్నాను. మెయిల్ లలో, యూట్యూబ్ వంటి సైట్లలో కామెంట్ల కోసం, ఇలా బ్లాగింగ్ కు...ఇలా పలు చోట్ల మనం యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ ను ఉపయోగించి యూనికోడ్ ఫాంట్స్ తో తెలుగు టైప్ చేయవచ్చు.

విండోస్ 7 నుండి 10 వరకు ఈ తరహాగా మనం డైరెక్టుగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఆల్ట్ మరియు షిఫ్ట్ కీల కాంబినేషన్ ప్రెస్ చేయడం ద్వారా లేఅవుట్ల మధ్య టాగుల్ అవ్వవచ్చు. గూగుల్ ఇన్ పుట్ టూల్స్ ద్వారా పలువురు తెలుగు టైప్ చేస్తుంటారు. అదేవిధంగా రీజనల్ ల్యాంగ్వేజెస్ ను యాడ్ చేసుకోవడం ద్వారా విండోస్ 10 వంటి ఆపరేటింగ్ సిస్టం లలో మనం తెలుగును అతి సులభంగా ఇంగ్లీషు లేఅవుట్ నుండి టాగుల్ అవుతూ వాడుకోవచ్చు. ముందుగా రీజనల్ ల్యాంగ్వేజెస్ లో తెలుగును యాడ్ చేసుకుని, ఆ తర్వాత యాపిల్ కీ బోర్డ్ లేఅవుట్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఇపుడు నేను చెప్పిన విధంగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు.

దీనికి సంబంధించి లే అవుట్ కోసం యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ అని యూనికోడ్ ఫాంట్స్ కోసం సెర్చ్ చేస్తే మీకు 248కెబి ఫైల్ లభిస్తుంది. ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఇపుడు నేను చెప్పిన విధంగా మీరు తెలుగులో యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ తో టైప్ చేయవచ్చు.

ఈ పైన చూపించిన విధంగా విండోస్ 10లో మనకు కనిపిస్తుంది. రీజనల్ ల్యాంగ్వేజెస్ లో తెలుగును ఇన్ స్టాల్ చేసుకుని, ఆప్షన్స్ లో యాడ్ కీ బోర్డ్ ద్వరా మనం యాపిల్ తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ను యాడ్ చేసుకోవచ్చు. 

నేను ముందు చెప్పిన విధంగా ఇంగ్లీషు మరియు తెలుగు కీబోర్డులను ఆల్ట్ మరియు షిఫ్ట్ కీల కాంబినేషన్ ఉపయోగించి టాగుల్ అవుతూ ఉపయోగించుకోవచ్చు. 

 ఇక యాపిల్ కీబోర్డ్ రానివారు కూడా విండోస్ లో నేను ముందు పేర్కొన్న అక్షరమాల సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా సులభంగా మెయిల్, ఇతర సైట్లలో తెలుగులో టైప్ చేసుకోవచ్చు.

యాపిల్ కీబోర్డ్ లే అవుట్ కోసం : http://apple-telugu-keyboard-layout.software.informer.com/

అక్షరమాల సాఫ్ వేర్ కోసం : http://aksharamala.software.informer.com/3.6/

No comments: