జీవితంలో ఒక్కసారి ప్రేమించడం జరిగితే..అది ప్రాణం పోయేదాకా ఆ వ్యక్తిపై పదిలం...సినిమాలలో హీరో హీరోయిన్ల ఇలాంటి డైలాగుల మాటటుంచితే...నిజ జీవితంలో కుక్కలకు అచ్చుగుద్దినట్టు సరిపోయే ఉపమానం ఇది. తన యజమానిపై అచంచలమైన ప్రేమ..యజమానే తన సర్వస్వం అని నమ్ముతూ, వారి కోసమే తన జీవితం మొత్తాన్ని అంకితం చేసే ఒకే ఒక్క జాతి. చరిత్ర తిరగేస్తే...కన్నీళ్ళు తెప్పించే, శునకాలపై మన ప్రేమ మరింత పెంచే ఘటనలు ఎన్నో...తన యజమాని కోసం దాదాపు దశాబ్ధ కాలం పాటు నిత్యం రైల్వే స్టేషన్ వద్ద కాపలా కాసిన హాచికో గురించి తెలియని జంతు ప్రేమికులు ఉండరు. అంతలా ప్రేమ పాత్రుడైన ఆ యజమాని ధన్యుడు. అతని కోసం తన ప్రాణం చివరి క్షణం వరకూ పరితపించిన ఆ హాచికో మరింత ధన్యురాలు. తలచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కించే మూవీ హాచికో..యజమానిపై తనకున్న విశ్వాసాన్ని చూపుతూ, యజమాని కోసం పరితపిస్తూ, యజమానిని కలుసుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుని, చివరకు తన యజమానిని చేరుకున్న ఒక కుక్క యొక్క కల్పిత గాధ 'లాసీ..కమ్ హోమ్'. నవలగా ఎంత పాపులర్ అయ్యిందో సినిమాగానూ అంతే పాపులర్ అయ్యి పలువురి మనసులను కొల్లగొట్టిన సినిమా. ఈ చిత్రాన్ని 1943లో మెట్రో గోల్డ్ విన్ మేయర్ టెక్నీకలర్ చిత్రంగా నిర్మించింది. రఫ్ కొలీ జాతికి చెందిన శునకానిది ఇందులో ప్రధాన పాత్ర. ఎరిక్ నైట్ 1940లో రచించిన లాసీ కం హోమ్ అనే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మించారు. ఫ్రెడ్ ఎం విల్ కాక్స్ దర్శకత్వం వహించగా, స్కీన్ ప్లే హ్యూగో బట్లర్ చేశారు. కథలోకి వెళితే...ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్లో కథ ప్రారంభం అవుతుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో, మానసిక వేదనకు గురవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ కారక్లాఫ్ తాము ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కోలీ జాతి శునకం లాసీని ధనవంతుడైన డ్యూక్ ాఫ్ రుడ్లింగ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తుంది. అతను కూడా లాసీని ఎంతో ఇష్టపడేవాడు. అయితే కారక్లాఫ్ దంపతుల పుత్రుడు జోయ్ కి మాత్రం తనకు ఎంతో ఇష్టమైన లాస్సీ దూరం కావడం ససేమిరా ఇష్టం ఉండదు. కానీ పరిస్థితులు వారిని దూరం చేస్తాయి. మరోవైపు లాస్సీది కూడా అదే పరిస్థితి. తనకు డ్యూక్ తో ఉండటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. డ్యూక్ యొక్క మిగతా కుక్కల నుండి తప్పించుకుని జోయ్ దగ్గరకు తిరిగి వచ్చేందుకు మార్గాలను అన్వేషించడం మొదలుపెడుతుంది. ఒకరోజు డ్యూక్ లాస్సీని స్కాట్లాండ్ లో వందల మైళ్ళ దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ అతని మనవరాలు ప్రిస్సిలా లాస్సీ యొక్క అసంతృప్తిని గ్రహించి, లాస్సీ తప్పించుకునే ఏర్పాట్లు చేస్తుంది. దాంతో లాస్సీ అక్కడి నుండి తాను ఎంతగానో అభిమానించే జోయ్ ను తిరిగి కలుసుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో లాస్సీ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుక్కలను పట్టుకునేవాళ్ళు మరియు భయానక తుఫాను వంటివి ఎదురౌతాయి. అయితే ఈ ప్రయాణంలో పలువురు దయార్ధ్ర హృదయులు లాస్సీని ఆధరిచడంతోపాటు సహాయం కూడా అందిస్తారు. మరోవైపు ఇక తన జన్మలో లాస్సీని చూడలేనేమోననే నిస్పృహ జోయ్ ను ఆవరిస్తుంది. ఆవేదన చెందుతుంటాడు. ఆ తరుణంలో తన సుదూర ప్రయాణంతో అలసిపోయిన లాస్సీ తనకు ఎంతో ఇష్టమైన విశ్రాంతి ప్రదేశమైన ఇంటివద్ద గల స్కూల్ ప్రాంగణాన్ని చేరుకుంటుంది. పాఠశాల నుంచి జోయ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాఠశాల నుంచి బయటకు వస్తున్న జోయ్ కళ్ళ ఎదురుగా లాస్సీ. ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన పరిస్థితి జోయ్ ది. లాస్సీ దగ్గరకు పరుగు తీస్తాడు. అటు లాస్సీ కూడా ఎవరికోసమైతే తాను అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసిందో అతను తన అభిమాన జోయ్ కళ్ళ ఎదురుగా కనపడగానే తన కాలి దెబ్బను సైతం లక్ష్యపెట్టకుండా ఆనందంతో జోయ్ దగ్గరకు చేరుకుంటుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గల ప్రేమ, ఆ దృశ్యం ఒక్కసారిగా మన కళ్ళల్లో నీళ్ళు నింపుతుంది. వారు ఎట్టకేలకు కలిసినందుకు మనసు తేలిక పడుతుంది. సినిమా చూస్తున్నంతసేపూ, లాసీపై మనకున్న ప్రేమ మరింత రెట్టింపవుతూ ఉంటుంది..మనం కూడా లాసీలాగే ఆ యజమానిని లాసీ కలుసుకోవాలని ఆకాంక్షిస్తాం. ప్రార్థిస్తాం..లాసీ ఎదుర్కొటున్న బాధలను చూసి దు:ఖిస్తాం. అందుతున్న సాయం చూసి మనసు తేలిక చేసుకుంటాం. ఎప్పుడు లాసీ తన యజమానిని చేరుతుందా అని బరువెక్కిన హ్రుదయంతో, చెమ్మగిల్లిన కళ్ళతో ఎదురుచూస్తాం. చివరికి తన యజమానిని కలిసిన లాసీని చూసి, ఆనందభాష్పాలు రాలుస్తాం. బరువెక్కిన గుండెతో కొంతసేపు అలాగే ఉండిపోతాం. 1993 లో ఈ చిత్రానికి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఆ ఏడాదికి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యొక్క నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీకి జోడించిన 25 చలన చిత్రాల వార్షిక ఎంపికలో లాస్సీ కమ్ హోమ్ చేర్చారు. అంతేకాక "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా ముఖ్యమైనదిగా ఈ చిత్ర సంరక్షణ కోసం సిఫార్సు సైతం చేశారు. మనలోని మానవత్వాన్ని, జంతువులపై గల ప్రేమని మరొకసారి తట్టిలేపే అద్భుతమైన రచన 'లాసీ..కమ్ హోమ్'. తప్పక చూడదగ్గ సినిమా...పుస్తక ప్రియులకు ఒక అద్భుతమైన కానుక...'లాసీ...కమ్ హోమ్'.
No comments:
Post a Comment