Friday, September 10, 2021

అనుబంధాలు (Anubandhaalu)

 

ఏవండీ....మనవాడు పొద్దున్నించీ కనిపించడం లేదండీ...’

తీరిగ్గా కూచుని న్యూస్ పేపర్ తిరగేస్తున్న భర్త రాజారాం దగ్గరకు కంగారుగా వస్తూ చెప్పింది భార్య మంగతాయారు.

పొద్దున్నించీ కనిపించకపోవడం ఏమిటీ ? సరిగ్గా చూశావా ?’ చేతిలోని పేపర్ ని వెంటనే టేబుల్ పై పెట్టేస్తూ లేచాడు రాజారాం.

ఉదయం నేను వంటగదిలో ఉండగా వచ్చాడు..ఆకలేస్తోందా నాన్నా అని కొన్ని బిస్కెట్లు, కొంచెం పాలు ఇచ్చాను. బిస్కట్లు తిని పాలు తాగేసి అక్కడే అలాగే చూస్తూ బజ్జున్నాడు. నేను వంట పనిలో నిమగ్నమయ్యాను. కొంచెం సేపయ్యాక వెనక్కు తిరిగి చూస్తే అక్కడ లేడు. లోపలికి వచ్చి పిలిచినా పలకడం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏమిటో ?’ చంటిబిడ్డ కనిపించకపోతే తల్లడిల్లిపోతున్న తల్లిలా తన భార్య మంగతాయారు పడుతున్న ఆందోళన చూస్తున్న రాజారాం పెదాలపైన చిన్న దరహాసం.

ఆదుర్దాగా అటూ ఇటూ చూస్తున్న మంగతయారు భర్త మోములోని చిరు దరహాసాన్ని గమనించి చిన్నబుచ్చుకుంది.

-----

రాజారాం పోస్టాపీసులో పోస్టుమాన్ గా చేసి రిటైర్ అయ్యారు. పెద్ద సొంతిల్లు. ఒక్కడే కొడుకు. ఉద్యోగంలో ఉండగానే కొడుక్కి బంధువులమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేశారు. కొడుకూ కోడలూ వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రాజారాంకి ఎంతో ఖాళీ సమయం దొరికినంతలా ఉంది. ఏం తోచక భార్యను బలవంతంగా దగ్గర కూర్చోబెట్టుకుని తన ఆఫీసు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాడు. భార్య మంగతాయారుకు భర్త సమస్య అర్ధమయ్యింది. అతనికి ఏదో ఒక వ్యాపకం ఉంటే బాగుణ్ణు అనుకునేది. టీవీలో కార్యక్రమాలు చూడటం కంటే టీవీనే లేదనుకుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందనే భావనే ఇద్దరిదీ. ఒకరోజు సాయంత్రం వేళ గుమ్మం దగ్గర కూర్చుని భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో గేటు వద్దకు వచ్చి గేటు సందులలోంచి లోపలికి వద్దామనుకుంటున్న చిన్న కుక్కపిల్ల వాళ్ళ కంట పడింది. చాలా బుజ్జిగా, ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్ల ఆ చిన్న గేటు సందులలోంచి లోపలికి రావాలని చేస్తున్న ప్రయత్నం వారిద్దరికీ చూడముచ్చటేసింది.

వారి వీధిలో కొన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి కంట్లో ఈ చిన్నది పడితే ఏమన్నా చేస్తాయేమోనన్న ఆలోచన మంగతాయారును కలవరపెట్టింది. వెంటనే మంగతాయారు దాన్ని ఎత్తుకుని తన వెనకే వచ్చిన భర్త రాజారాంకి చూపించింది. మంగతాయారు చేతిలో బుజ్జిగా చిన్ని చిన్ని రేగిపండులాంటి కళ్ళతో మిణుకు మిణుకు మంటూ చూస్తున్న ఆ చిన్న కుక్కపిల్ల ఇద్దరి మనసులనూ కొల్లగొట్టింది. ఆ క్షణం నుంచీ ఆ ఇంటి సభ్యుడుగా మారిపోయింది. టామీ అని నామకరణం చేశారు.

టామీ వచ్చిన దగ్గరనుంచీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ రాజారాంకి మహా కాలక్షేపంగా ఉంటోంది. అది చూసి భార్య మంగతాయారు చాలా సంతోషించింది.

------

ఎందుకండీ ! నవ్వుతున్నారు !’ మూతి చిన్నగా ముడుచుకుంటూ, భర్త వైపు చూస్తూ అంది మంగతాయారు.

అబ్బే ! నవ్వడం లేదే ! వాడంటే నీకు చాలా ప్రేమ అని..’ అనునయిస్తూ అన్నాడు రాజారాం.

పోదురూ బడాయి..అక్కడికేదో మీకు ప్రేమ లేనట్టు..కనపడటం లేదని చెప్పగానే అన్నీ మర్చిపోయి నిల్చుండిపోలా?’ చిరు కోపం ప్రదర్శిస్తూ అంది మంగతాయారు.

అవుననుకో...మనకు వాడు...వాడికి మనం...ఇంతకీ ఎక్కడున్నాడో ? ఇల్లంతా వెతికావా ?’ అడిగాడు రాజారాం.

లేదండీ... పిలిచినా రాలేదు, మీ దగ్గరకు వచ్చాడేమో అనుకున్నా...’

సరే...వాడికీ మొక్కలంటే నాలానే మహా ఇష్టం...ఏ మొక్క దగ్గరున్నాడో..’

గేటు దగ్గర అటూ ఇటూ ఉన్న మొక్కలలో దేని వెనకో పడే ప్రయత్నం చేస్తూ కనిపించాడు ఒక ఏడాది వయసున్న టామీ.

ఏరా...అమ్మకు చెప్పకుండా అలా వెళ్ళిపోవడమేనా ? ఎంత కంగారుపడిపోయానో తెలుసా ?’

టామీ కనిపించగానే సర్వస్వం మరిచిపోయి వెంటనే వెళ్ళి చిన్నపిల్లాడిని హత్తుకున్నట్లు గుండెలకు హత్తుకుని మంగతాయారు చిన్నగా మందలిస్తోంది.

టామీ పట్ల తాను, తన భార్య పెంచుకున్న ప్రేమ, ఆ జంతువు తమపై చూపిస్తున్న ప్రేమ...ఏ జన్మ బంధమో అనుకున్నాడు రాజారాం.

------

కొడుకు మోహన్ డిగ్రీ దాకా చదువుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ పట్టణంలో ఏదో కంప్యూటర్ జాబు చేస్తున్నారు.

ఆఫీసుకు దగ్గరగా ఉండాలి అనే వంకతో అలా మనకు దూరంగా ఉంటున్నారు‘ అంటూ అప్పుడప్పుడూ భార్య మంగతాయారు కొడుకు గురించి తన దగ్గర చెప్పుకుని బాధపడుతుండటం రాజారావుకు పరిపాటే.

వారి జీవితం...వారికి ఎలా నచ్చితే అలా...మనం అర్ధం చేసుకోవాలి. అంతే..బిడ్డలకు బంధంగా నిలవాలి కానీ భారంగా మారకూడదు..అప్పుడే మనకు గౌరవం..రోజులు అలా ఉన్నాయి...’

భర్త మాటలకు ఇంకేం మాట్లాడలేక, భర్త కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంటుంది మంగతాయారు.

-----

ఎందుకోగానీ..రెండు రోజులుగా టామీ అన్నం తినడం లేదు. చిరుతిండ్లు తిన్నా అన్నం తినకపోతే నీరసించిపోతుందేమోనన్న బెంగ మంగతాయారుకు పట్టుకుంది. దగ్గరలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఒకసారి చూపిస్తే మంచిదన్న ఆలోచన భార్యాభర్తలకు కలిగింది. ముందురోజు సాయంత్రం రాజారాం ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి సమయాలు కనుక్కుని, తమ టామీ పరిస్థితిని డాక్టరుకు చెప్పి, ఒకసారి తీసుకురండి చూద్దాం అనడంతో మరుసటిరోజు ఉదయం తీసుకువెళ్ళారు. టామీనీ పరీక్షించిన డాక్టరు సమస్య ఏమీ లేదని, ఆకలి మందగించడం వల్లనే తినడం లేదనీ, చిరుతిండ్లు తగ్గించి, అన్నం ఎక్కువ తినేలా చూడాలని చెప్పాడు. రెగ్యులర్ గా చేయవలసిన ఇంజక్షన్ డోసేజీ చేసి పంపించాడు. ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది.

ఇంటికి వచ్చేసరికి ఎదురుగా కొడుకూ, కోడలూ.

వారిని అలా చూడగానే రాజారాం, మంగతయారులు కంగారు పడ్డారు.

ఏమ్మా అంతా కులాసాయేనా ? ఫోను చేయాల్సింది కదరా, ఇంట్లోనే ఉండేవాళ్ళం..’ అంత సడెన్ గా ఎందుకొచ్చారా అనే కంగారు ఆమె మాటలలో తొంగిచూస్తోంది.

ఈలోపున రాజారాం తలుపు తాళం తీయడంతో అందరూ లోపలికి వచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుని కూర్చున్నారు. కోడలు మానస అత్తగారితోపాటు వంటింటిలోకి వెళ్ళింది.

ఏం నాన్నా...అమ్మకీ, మీకూ ఆరోగ్యం ఎలా ఉంటోంది ?’

కొడుకు అడిగిన ప్రశ్నకు రాజారాం కళ్ళు మెరిసాయి. పెద్దవాళ్ళయిన తల్లిదండ్రులు తమ బిడ్డల నుంచీ కోరుకునేది డబ్బూ దస్కాలూ కాదు...ఇటువంటి ఆప్యాయతతో కూడిన మాటలే కదా అనుకున్నాడు.

ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉన్న తండ్రిని చూసి ఒకింత ఆందోళనతో మోహన్ మళ్ళీ అదే ప్రశ్న రెట్టించాడు.

......ఇద్దరం బాగానే ఉన్నాం రా...ఇదిగో వీడికి కొంచెం నలతగా ఉందేమోనని ఆసుపత్రికి తీసుకువెళ్ళాం..ఇంజెక్షన్లు కూడా చేయించాల్సి ఉంది కదా..’

మీ ఆరోగ్యం జాగ్రత్త...వాడికేం కాదు..వాడి ఆలోచనలతో మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు...’

అయ్యో...అదేం లేదురా...శుభ్రంగా తింటున్నాం..ఉంటున్నాం...ఒంటరిగా ఉన్నామనే ఆలోచన రాకుండా ఈ టామీ గాడు రోజంతా ఏదో అల్లరి చేస్తూ సందడి చేస్తున్నాడు..వీడి సందడితో మాకు మా గురించిన ఆలోచనలేం ఉండటం లేదురా...ఉదయం నుంచీ రాత్రి పడుకోబోయేవరకూ వీడితో కాలక్షేపం సరిపోతోంది..’

అదేంటి నాన్నా...మేం లేమా...ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన ఎందుకు ? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గరకి రావచ్చన్నా కదా ?’

అవుననుకో...ఉదయం నుంచీ రాత్రి వరకూ మీరు ఆఫీసుల్లో గొడ్డు చాకిరీ చేసి వచ్చి, ఇంట్లో మళ్ళీ మాకు చాకిరీ చేయాలంటే ఇబ్బందే కదరా..మీకు అడ్డుగా మేం ఎందుకులే అని..అయినా...మీరు ఇలా అప్పుడప్పుడు వచ్చి మమ్మ ల్ని చూసి వెళ్తున్నారాయే..ఇంకేం కావాలి ?’

తండ్రి మాటలు తన హృదయాన్ని ఎక్కడో తాకుతున్న అనుభూతి మోహన్ కు కలుగుతోంది. మొగుడు పెళ్ళాలు, ప్రైవసీలు, సంపాదనలు...ఇలా రకరకాల కారణాలు...కారణం ఏదైతేనేమి...కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు...పెళ్ళయ్యాక పరాయివాళ్ళవుతున్నారు.

ఏదో అలా చెప్పుకుంటూ పోతున్న రాజారావు కొడుకు ముఖం చూసి ఒక్క క్షణం ఆగాడు..

ఏరా కన్నా...మీకిద్దరికీ ఆరోగ్యం ఎలా ఉంది ? ఇద్దరూ కలివిడిగానే ఉంటున్నారు కదా ! ఎట్టి పరిస్థితిలోనూ అమ్మాయి మనసు కష్టపెట్టకురా కన్నా...నిన్ను నమ్మి వచ్చింది. జాగ్రత్తగా చూసుకో..ఒకవేళ ఏదైనా మాట అన్నదనుకో...నీ బిడ్డ ఒకమాట అంది అనుకో, అంతేకానీ తిరగబడకు. సరేనా..మీరు ఆనందంగా ఉంటేనే కదరా పెద్దవాళ్ళుగా మాకు సంతోషం. మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది..’

అప్పుడే హాలులోకి వస్తున్న మానస చెవిన మామగారి మాటలు పడ్డాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘మామయ్యా...కాఫీ...కొంచెం సేపట్లో భోజనం సిద్ధమవుతుంది. ఆరోగ్యం ఎలా ఉంది మామయ్యా’ చేతిలో కాఫీ కప్పు పెడుతూ వంగి కాళ్ళకు దణ్ణం పెట్టుకుని పక్కనే కూర్చుంది.

ఆమె కళ్ళలో నీళ్ళు చూసిన రాజారాం కంగారు పడ్డాడు.

ఏమ్మా...ఆ కళ్ళలో నీళ్ళేంటి తల్లీ ? మావాడేమన్నా అన్నాడా ?...’

అబ్బే అదేం లేదు మామయ్యా...కంగారు పడకండి...అలాంటిదేమీ లేదు. మీ అబ్బాయిది మీ పెంపకం..ఎన్నడూ కూడా భార్య పట్ల దురుసుగా ప్రవర్తించే రకం కాదు..కానీ...నేనే అప్పుడప్పుడూ కొంచెం అలిగి..తనని బాధపెడుతుంటాను..’

మీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమగా అన్యోన్యంగా, ఆనందంగా ఉండాలి తల్లీ..మాకు మీ సంతోషమే ముఖ్యం..మీరు ఆనందంగా ఉంటేనే కదా మాకు సంతోషం..’

నన్ను క్షమించండి మామయ్యా...ఉద్యోగం కారణంగా మేము మీకు దూరంగా ఉండటం మాకూ ఇష్టం ఉండటం లేదు. కోడలు వచ్చింది కొడుకును దూరం చేసిందన్న అపవాదు నాకొద్దు. మనందరం కలిసుందాం, ఇక్కడకు తీసుకువచ్చేయండి అంటూ రోజూ మీ అబ్బాయికి చెబుతూనే ఉన్నా..’

అయ్యో తల్లీ...అలా ఎందుకనుకుంటావు ? అయినా, మీరేం ఎక్కడో అమెరికాలోనో, లండన్ లోనో లేరు కదా...అరగంట ప్రయాణం. అయినా, ఇక్కడ మాకు లోటేముంది ? ఏదో ఒకటి చేసుకు తింటున్నాం..రోజంతా సందడి చేసేందుకు వీడున్నాడు..’ తనకు దగ్గరగా ప్రశాంతంగా బజ్జుని చూస్తున్న టామీని చూపిస్తూ అన్నాడు రాజారాం.

కానీ ...మామయ్యా...మీరు కూడా మా దగ్గరకి వచ్చేస్తే బాగుంటుంది కదా అనీ...’

మాకు ఎప్పుడైనా అలా మిమ్మల్ని చూడాలన్నప్పుడు వస్తూనే ఉన్నాం కదమ్మా...అయినా మీకు సెలవులుండాలి..ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ ఆఫీసులోనే కదా..ఎప్పుడో పొద్దున్న వెళితే రాత్రికి గానీ రారాయే..అక్కడైనా, ఇక్కడైనా మేమిద్దరమే కదా..ఇక్కడైతే అలవాటు పడిన వాతావరణం..అన్నింటికీ మించి ఇదిగో వీడూ వీడి సందడీ. వీడితో కాలక్షేపంతో ఇక్కడైతే సమయం తెలియట్లేదమ్మా..ఇంకా మీ అత్తయ్య మీరిద్దరూ వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తే బాగుండు అనుకుంటోంది. సెలవు దొరికి మీకు వీలయినప్పుడల్లా ఒకసారి మమ్మల్ని చూసి వెళుతూ ఉంటే మాకూ అదో సంతోషం...’

కొడుకు, కోడలికి తాము భారం కాకూడదన్న తన భర్త ఆలోచనను అతని మాటల్లో మంగతాయారు గమనిస్తోంది.

భోజనాలు చేశాక, ఏదో పని ఉందంటూ కొడుకూ కోడలూ తిరిగి ప్రయాణమయ్యారు. గేటు వరకూ వెళ్ళాక మోహన్ ఒక్క ఉదుటున వెనక్కి వచ్చి టామీని ఎత్తుకుని గుండెలకు బలంగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా అందరిలో ఏదో తెలియని ఉద్వేగం. మోహన్ భార్య మానస వచ్చి భర్త భుజం, వీపు నిమిరింది.

తేరుకున్న మోహన్ టామీని ముద్దు పెట్టుకుని, ‘అమ్మా, నాన్నా... వెళ్ళొస్తాం, మళ్ళీ వీలు చూసుకుని వస్తాం’ అంటూ బయలుదేరారు.

కనుచూపు మేర వరకూ కొడుకూ కోడలూ వెళ్ళిపోయాక, రాజారాం, మంగతాయారూ గేటు వేసి వెనుదిరిగారు. తన కొడుకు వెళ్ళేవాడల్లా అలా వెనక్కు వచ్చి టామీని హత్తుకున్న వైనం గురించి మంగతాయారుకు ఏమీ అర్ధం కాలేదు. భర్తను అదే విషయం అడిగితే, చిరునవ్వు చిందించి లోపలకు దారితీసాడు. రాజారాం చేతులు చాచగానే ఎగిరి చంకనెక్కిన టామీని విడ్డూరంగా చూస్తూ భర్త వెనకే నడిచింది మంగతాయారు.



-----

Sunday, September 13, 2020

A must read book and a must see movie..."Lassie...come home". ఒక మంచి నవల చదువుదాం...ఎరిక్ నైట్ ''లాసీ కమ్ హోమ్''

జీవితంలో ఒక్కసారి ప్రేమించడం జరిగితే..అది ప్రాణం పోయేదాకా ఆ వ్యక్తిపై పదిలం...సినిమాలలో హీరో హీరోయిన్ల ఇలాంటి డైలాగుల మాటటుంచితే...నిజ జీవితంలో కుక్కలకు అచ్చుగుద్దినట్టు సరిపోయే ఉపమానం ఇది. తన యజమానిపై అచంచలమైన ప్రేమ..యజమానే తన సర్వస్వం అని నమ్ముతూ, వారి కోసమే తన జీవితం మొత్తాన్ని అంకితం చేసే ఒకే ఒక్క జాతి. చరిత్ర తిరగేస్తే...కన్నీళ్ళు తెప్పించే, శునకాలపై మన ప్రేమ మరింత పెంచే ఘటనలు ఎన్నో...తన యజమాని కోసం దాదాపు దశాబ్ధ కాలం పాటు నిత్యం రైల్వే స్టేషన్ వద్ద కాపలా కాసిన హాచికో గురించి తెలియని జంతు ప్రేమికులు ఉండరు. అంతలా ప్రేమ పాత్రుడైన ఆ యజమాని ధన్యుడు. అతని కోసం తన ప్రాణం చివరి క్షణం వరకూ పరితపించిన ఆ హాచికో మరింత ధన్యురాలు. తలచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కించే మూవీ హాచికో..యజమానిపై తనకున్న విశ్వాసాన్ని చూపుతూ, యజమాని కోసం పరితపిస్తూ, యజమానిని కలుసుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుని, చివరకు తన యజమానిని చేరుకున్న ఒక కుక్క యొక్క కల్పిత గాధ 'లాసీ..కమ్ హోమ్'. నవలగా ఎంత పాపులర్ అయ్యిందో సినిమాగానూ అంతే పాపులర్ అయ్యి పలువురి మనసులను కొల్లగొట్టిన సినిమా. ఈ చిత్రాన్ని 1943లో మెట్రో గోల్డ్ విన్ మేయర్ టెక్నీకలర్ చిత్రంగా నిర్మించింది. రఫ్ కొలీ జాతికి చెందిన శునకానిది ఇందులో ప్రధాన పాత్ర. ఎరిక్ నైట్ 1940లో రచించిన లాసీ కం హోమ్ అనే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మించారు. ఫ్రెడ్ ఎం విల్ కాక్స్ దర్శకత్వం వహించగా, స్కీన్ ప్లే హ్యూగో బట్లర్ చేశారు. కథలోకి వెళితే...ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్లో కథ ప్రారంభం అవుతుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో, మానసిక వేదనకు గురవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ కారక్లాఫ్ తాము ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కోలీ జాతి శునకం లాసీని ధనవంతుడైన డ్యూక్ ాఫ్ రుడ్లింగ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తుంది. అతను కూడా లాసీని ఎంతో ఇష్టపడేవాడు. అయితే కారక్లాఫ్ దంపతుల పుత్రుడు జోయ్ కి మాత్రం తనకు ఎంతో ఇష్టమైన లాస్సీ దూరం కావడం ససేమిరా ఇష్టం ఉండదు. కానీ పరిస్థితులు వారిని దూరం చేస్తాయి. మరోవైపు లాస్సీది కూడా అదే పరిస్థితి. తనకు డ్యూక్ తో ఉండటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. డ్యూక్ యొక్క మిగతా కుక్కల నుండి తప్పించుకుని జోయ్ దగ్గరకు తిరిగి వచ్చేందుకు మార్గాలను అన్వేషించడం మొదలుపెడుతుంది. ఒకరోజు డ్యూక్ లాస్సీని స్కాట్లాండ్ లో వందల మైళ్ళ దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ అతని మనవరాలు ప్రిస్సిలా లాస్సీ యొక్క అసంతృప్తిని గ్రహించి, లాస్సీ తప్పించుకునే ఏర్పాట్లు చేస్తుంది. దాంతో లాస్సీ అక్కడి నుండి తాను ఎంతగానో అభిమానించే జోయ్ ను తిరిగి కలుసుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో లాస్సీ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుక్కలను పట్టుకునేవాళ్ళు మరియు భయానక తుఫాను వంటివి ఎదురౌతాయి. అయితే ఈ ప్రయాణంలో పలువురు దయార్ధ్ర హృదయులు లాస్సీని ఆధరిచడంతోపాటు సహాయం కూడా అందిస్తారు. మరోవైపు ఇక తన జన్మలో లాస్సీని చూడలేనేమోననే నిస్పృహ జోయ్ ను ఆవరిస్తుంది. ఆవేదన చెందుతుంటాడు. ఆ తరుణంలో తన సుదూర ప్రయాణంతో అలసిపోయిన లాస్సీ తనకు ఎంతో ఇష్టమైన విశ్రాంతి ప్రదేశమైన ఇంటివద్ద గల స్కూల్ ప్రాంగణాన్ని చేరుకుంటుంది. పాఠశాల నుంచి జోయ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాఠశాల నుంచి బయటకు వస్తున్న జోయ్ కళ్ళ ఎదురుగా లాస్సీ. ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన పరిస్థితి జోయ్ ది. లాస్సీ దగ్గరకు పరుగు తీస్తాడు. అటు లాస్సీ కూడా ఎవరికోసమైతే తాను అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసిందో అతను తన అభిమాన జోయ్ కళ్ళ ఎదురుగా కనపడగానే తన కాలి దెబ్బను సైతం లక్ష్యపెట్టకుండా ఆనందంతో జోయ్ దగ్గరకు చేరుకుంటుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గల ప్రేమ, ఆ దృశ్యం ఒక్కసారిగా మన కళ్ళల్లో నీళ్ళు నింపుతుంది. వారు ఎట్టకేలకు కలిసినందుకు మనసు తేలిక పడుతుంది. సినిమా చూస్తున్నంతసేపూ, లాసీపై మనకున్న ప్రేమ మరింత రెట్టింపవుతూ ఉంటుంది..మనం కూడా లాసీలాగే ఆ యజమానిని లాసీ కలుసుకోవాలని ఆకాంక్షిస్తాం. ప్రార్థిస్తాం..లాసీ ఎదుర్కొటున్న బాధలను చూసి దు:ఖిస్తాం. అందుతున్న సాయం చూసి మనసు తేలిక చేసుకుంటాం. ఎప్పుడు లాసీ తన యజమానిని చేరుతుందా అని బరువెక్కిన హ్రుదయంతో, చెమ్మగిల్లిన కళ్ళతో ఎదురుచూస్తాం. చివరికి తన యజమానిని కలిసిన లాసీని చూసి, ఆనందభాష్పాలు రాలుస్తాం. బరువెక్కిన గుండెతో కొంతసేపు అలాగే ఉండిపోతాం. 1993 లో ఈ చిత్రానికి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఆ ఏడాదికి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యొక్క నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీకి జోడించిన 25 చలన చిత్రాల వార్షిక ఎంపికలో లాస్సీ కమ్ హోమ్ చేర్చారు. అంతేకాక "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా ముఖ్యమైనదిగా ఈ చిత్ర సంరక్షణ కోసం సిఫార్సు సైతం చేశారు. మనలోని మానవత్వాన్ని, జంతువులపై గల ప్రేమని మరొకసారి తట్టిలేపే అద్భుతమైన రచన 'లాసీ..కమ్ హోమ్'. తప్పక చూడదగ్గ సినిమా...పుస్తక ప్రియులకు ఒక అద్భుతమైన కానుక...'లాసీ...కమ్ హోమ్'.



Thursday, May 14, 2020

Prayanam (ప్రయాణం)


'హాయ్ సర్...ఎక్కడికి వెళుతున్నారు?'...
రైలు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న విక్రమ్ ఆ పలకరింపుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు..
'...పాలకొల్లు'
ఆమె ఎవరా అని ఆశ్చర్యంతో కూడిన కళ్ళతో చూస్తూ సమాధానమిచ్చాడు.
అతని ఆలోచన తనకు అర్థమైనట్టుగా కిలకిలా నవ్వేస్తూ...
'నా పేరు హర్షిత...మీతో ఇదే పరిచయం లేండి..ఇంతకు ముందెప్పుడూ మీరు నన్ను చూడలేదు'
తన ఆలోచనలను చాలా చక్కగా చదివినట్టుగా ఠక్కున ఆమె ఇచ్చిన సమాధానానికి అతని మోములో చిరునవ్వు మెరిసింది.
ఆమె కూడా అది అర్థమైనట్టుగా మరోసారి కిలకిలా నవ్వింది.
కాసేపు నిశ్శబ్ధం...ఇద్దరూ రైలు కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉండిపోయారు.

నిశ్శబ్ధాన్ని చేధిస్తూ ఆమె అడిగింది...'ఏంటి సార్..ఏదైనా పని మీద వెళ్తున్నారా?'
'లేదు...అమ్మ వాళ్ళను చూడటానికి వెళుతున్నా..'
'నేనూ మా అమ్మవాళ్ళను చూడటానికే వెళుతున్నా...మీ పాలకొల్లు పక్కనే ఉన్న గ్రామం మాది..'
'నేను విజయవాడలో ఒక ఆఫీసులో చేస్తున్నా..అప్పుడప్పుడూ అమ్మవాళ్ళను చూడటానికి వస్తుంటా..' చెప్పాడతను.
'నేనూ ఒక ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నా..సారీ...చేసేదాన్ని..'
'అదేం? మానేశారా?...' ఆశ్చర్యంగా అడిగాడతను.
'అవునండీ...అమ్మవాళ్ళను మిస్ అవుతున్నా...అందుకే...ఏదైనా చిన్న జాబ్ దగ్గరలోనే చూసుకుందామని..' తన మనసులో మాట బయటపెట్టింది హర్షిత.
'అయ్యో...మంచి జాబే అయ్యుంటుంది కదా...ఎందుకు మానేయడం?..' ..ఓదార్పుగా అడిగాడు విక్రమ్.
'మంచి జాబే సార్..కానీ, అమ్మవాళ్ళను వదిలి ఎక్కడో వేలకు వేలు తెచ్చుకునేకంటే, పెద్దవయసులో ఉన్నవారికి దగ్గరగా, తోడుగా ఉంటూ ఆ సాలరీలో సగం తెచ్చుకున్నా ఆర్థికంగా ఇబ్బందేం ఉండదు, పైగా మన వాళ్ళదగ్గరే ఉన్నామన్న ఆత్మసంతృప్తి ఉంటుంది.'
ఇంకేం మాట్లాడలేకపోయాడు విక్రమ్. కానీ మనసులో మాత్రం పలు ఆలోచనలు...రైలు కంటే వేగంగా గిరగిరా తిరుగుతున్నాయి.
మళ్లీ నిశ్శబ్దం...కొంత సమయం గడిచింది. మళ్ళీ నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఆమే పలకరించింది..'విజయవాడలో ఒక్కరే ఉంటున్నారా?'
'యా...ఐ యామ్ స్టిల్ బ్యాచిలర్ యూ నో...' కాస్త కామెడీగా ఆమెను నవ్వించడానికన్నట్టు అతను అలా అనేసరికి తను కూడా నవ్వేసింది.
ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు.....ఎన్నాళ్ళ నుంచో స్నేహితుల్లా ఇద్దరూ ఒకరి విషయాలను గురించి ఒకరికి చెప్పుకుంటూ మధ్యమధ్యలో జోకులు వేసుకుంటూ....

సమయం తెలియకుండానే వేగంగా గడిచిపోయింది. సాయంత్రం అయ్యింది.
'ఇంకొంచెం సేపట్లోనే మన స్టేషన్ వచ్చేస్తుంది..నేనూ మీతోపాటే దిగాలి సుమా...స్టేషన్ రాగానే ఏం సంబంధం లేనట్లు నన్నొదిలేసి గబగబా దిగేయడం కాదు, అయ్యో ఆడపిల్ల సాయం చేద్దాం అనుకోవాలి..'
చిన్నపిల్లలా తను అలా అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు పెదవులపై చిరునవ్వు వెల్లివిరిసింది విక్రమ్ కి.
'అలాగే మేడం...మీరు ఎలా చెబితే అలా...' మహారాణి ఎదుట సేవకుడు చిత్తం మహారాణి అంటూ చేసినట్టుగా చేసాడు విక్రమ్.
అతనలా చేసేసరికి ఆమెకూ నవ్వు వచ్చింది. '...ఆ అదీ..మేమంటే ఆమాత్రం భయభక్తులు ఉండాలి మరి...' అంటూ కిలకిలా నవ్వేసింది.
స్టేషన్ రానే వచ్చింది. తన బ్యాగు భుజాన వేసుకుని ఆమె దగ్గర ఉన్న మూడు బ్యాగులలో రెండు తన భుజాలకు తగిలించుకున్నాడు విక్రమ్.
'అయ్యో..అయ్యో...సరదాకి అన్నానండీ...నేను మోస్తాను పర్వాలేదు...'అంటూ అతని దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించింది హర్షిత.
'అయ్యో పర్వాలేదు...త్వరగా దిగుదాం...ఈ రైలు ఎక్కే జనాలు మనల్ని దిగనివ్వకుండా లోపలే ఉంచేస్తే, రైలు కదిలిపోతే కష్టం..'
'అమ్మో...నిజమే..పదండి పదండి..' అంటూ అతనికంటే తనే ముందు దారిచూపిస్తూ, గుమ్మం దగ్గర ఎక్కేవారిని బాబూ కొంచెం దిగనివ్వండి అంటూ తాను దిగి మళ్ళీ వెనక్కు తిరిగి అతనివద్దనున్నబ్యాగులు అందుకుంటూ అతనిని చిన్నపిల్లాడిని చేయి పట్టుకుని దించినట్టు దించింది.
గబగబా ఆ రైలు, ఆ జనాల తోపులాట నుంచి ఇవతలికి వచ్చేసారు ఇద్దరూ.
'రైల్లో గంటల తరబడి జర్నీ చేయడం ఒకెత్తు...ఈ జనాలను తోసుకుంటూ ఎక్కడం దిగడం ఒకెత్తు..చాలా కష్టం సుమా' అన్నాడు విక్రమ్
'హా..అవును బాబోయ్..ఏం జనాలో..ఏం తోపులాటలో..అవతలి వ్యక్తి గురించి బొత్తిగా ఆలోచన ఉండదు..' నొసలు చిట్లిస్తూ కాస్తంత చిరుకోపంగా, అలసటగా, ముఖం మీద పడుతున్న ముంగురులను పక్కకు తోస్తూ అంటున్న హర్షిత కొంచెం కొత్తగా కనిపించింది అతనికి.
ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చేసారు.
'మీ గురించి ఎవరైనా వస్తారా తీసుకువెళ్ళడానికి?'
'ఏం? అప్పుడే నన్ను వదిలించుకుందామనా?...ఆకలేస్తోందిరా మగడా...ఇందాకటినుండి పట్టాలమీదనే కాదు, కడుపులోనూ రైళ్ళు పరుగెడుతున్నాయి. '...ఆకలి వేసినప్పుడు చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి అతని భుజం గట్టిగా పట్టుకుని ఆమె అలా అడిగేసరికి నాలిక్కరుచుకున్నాడు విక్రమ్.
'అవును కదా...అయ్యో నిజమే..మనం రైలులో బఠాణీలు, శెనగలు, బిస్కెట్లు వగైరా ఆమాంబాపతు చిరుతిండ్లు తిన్నాం తప్పితే భోజనం చేయాలన్న ఆలోచన రాలేదు, భోజనం తెప్పించుకుంటే బాగుండేది..'
'ఆ..అవును..పదండి ఏదైనా హోటల్ కి వెళదాం..'
భోజనాలయ్యాయి. ఇద్దరూ బ్యాగులు భుజాన వేసుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ నడక ప్రారంభించారు.
'ఇందాక చెప్పలేదు...ఎవరైనా వస్తారా?..మిమ్మల్ని వెతుక్కుంటారేమోనని అడుగుతున్నా...అంతే సుమా..' ఏదో భయం భయంగా అడుగుతున్నట్టుగా అడిగాడు విక్రమ్.
తాను ఇందాక అన్న మాటలు గుర్తొచ్చి కిసుక్కున నవ్వింది హర్షిత. 'లేదండీ...నాకు అలవాటే..నేనే వెళ్ళొస్తుంటా'
'దూరం అంటున్నారు...సాయంత్రం అయిపోయింది..'
'పోనీ...మీరే దించేయండీ...నాకైతే ఏం అభ్యంతరం లేదు..' అదేదో టూత్ పేస్ట్ యాడ్ లో మాదిరిగా పలువరుస అందంగా కనిపించేలా హాయిగా నవ్వేసింది హర్షిత.
'సరే..మీకు అభ్యంతరం లేకపోతే నేనూ రెడీనే...మిమ్మల్ని క్షేమంగా మీ ఇంట్లో దించే పూచీ నాది..' ఆమెకు ఏదో ధైర్యం చెబుతున్నవాడిలా ఫోజిస్తూ చెప్పాడు విక్రమ్.
మళ్ళీ కిలకిలా నవ్వేసింది హర్షిత.
'ఇంతకీ ఏ ప్రాంతంలో ఉంటున్నారు మీవాళ్ళు?' అడిగిందామె
తన చిరునామా చెప్పాడు విక్రమ్
తాను వెళ్ళవలసిన దారి విక్రమ్ వాళ్ళు ఉండే వైపు నుంచే వెళ్ళాలన్న సంగతి తెలిసేసరికి విక్రమ్ ను ఆటపట్టించాలనుకుంది హర్షిత.
'నేను ఇవాళ మీ ఇంటికి వచ్చేసి రేపు మా ఇంటికి వెళతాను..మీకేం ఇబ్బంది లేదుగా?'
తాను అలా అంటుందని ఊహించని విక్రమ్ కొద్దిగా ఆశ్చర్యానికి లోనై, తమాయించుకుని, 'అయ్యో...మాకేం ఇబ్బంది ఉండదు..పైగా రాత్రవుతోంది. నిజంగానే మీరు మా ఇంట్లో ఉండి రేపు వెళ్ళవచ్చు. స్వయంగా నేనే మీ ఇంట్లో మిమ్మల్ని దిగబెట్టి వస్తాను...సరేనా?' అన్నాడు.
'రాజువయ్యా...మహరాజువయ్యా...' ఆమె హమ్ చేస్తున్నట్టు పాడేసరికి పకపకా నవ్వేసాడు విక్రమ్.
ఇప్పటివరకూ చిరునవ్వే తప్ప అంతలా నవ్వని విక్రమ్ ను చూసి తాను కూడా ఆనందంగా నవ్వేసింది హర్షిత.
తాను వెళ్ళాల్సిన మార్గం వారి ఇంటివైపునుండే వెళ్ళాలని, అందుకనే తాను సరదాగా అలా అన్నానంటూ చెప్పింది.
విక్రమ్ మాత్రం తాను మనస్పూర్తిగానే రమ్మన్నానని, తన ఇంట్లోవాళ్ళు ఏమీ అనుకోరని, రావాల్సిందేనంటూ పట్టుబట్టడం మొదలుపెట్టాడు. చీకటి పడుతోందని, రేపు పొద్దున్నేఆమెను దించే బాధ్యత తనదంటూ బతిమాలాడటం ప్రారంభించాడు.
చివరికి ఆమెకు ఒప్పుకోక తప్పింది కాదు.
2
రాత్రి 7 దాటింది ఇంటికి చేరేసరికి...
గేటు శబ్దం అవ్వగానే బయటకి వచ్చిన అమ్మ తమని చూస్తూనే 'ఏమండీ..అబ్బాయి వచ్చాడు..' అంటూ తన భర్తను పిలుస్తూనే, గేటు తీయడానికి వచ్చి గేటు తీస్తూనే విక్రమ్ చేతిలో ఉన్న బ్యాగు, హర్షిత చేతిలో బ్యాగు అందుకుంటూ, 'ఏమ్మా...ప్రయాణం బాగా జరిగిందా?' అని అడిగింది.
ఆ అమ్మాయి ఎవరూ ఏమిటీ అనే ఆరాలేమీ లేకుండా అలా ఎంతో పరిచయమైన అమ్మాయిని పలకరించినట్టు పలకరించేసరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు విక్రమ్.
విస్తుపోయి చూస్తున్న విక్రమ్ ను చూసిన హర్షితకు నవ్వు ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు..
'ప్రయాణం బానే జరిగిందాంటీ...మీ అబ్బాయి ఉన్నాడుగా..దార్లో కబుర్లతో అసలు టైమే తెలీలేదు'..ఓరకంట విక్రమ్ ను చూస్తూనే అంది.
'సరే ఫ్రెష్ అయ్యి రండి..భోజనం చేద్దురుగాని...దార్లో ఏమన్నా తిన్నారో లేదో...'
ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టి చూస్తున్న విక్రమ్ ను మరింత ఆటపట్టించాలనిపించింది హర్షితకి...'అయ్యో...మీ అబ్బాయి నన్ను ఆకలితో ఉంచడమా..దారి పొడుగునా ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు..' అంది.
అసలేం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు.
తనను పలకరించకుండా ఏదో లోకంలో ఉన్నవాడిలా వెళ్ళిపోతున్న కొడుకు వంక విస్తుపోయి చూస్తూ నిలబడిపోయాడు తండ్రి.
అంతా గమనిస్తూనే ఉన్న హర్షితకు విక్రమ్ ఆలోచనలు అర్థమవుతూనే ఉన్నాయి. ఏమాత్రం పరిచయం లేని తనను తన తల్లి అంతలా ఆప్యాయంగా పలకరించడం, కనీసం ఎవరీ పిల్ల అని కూడా అడగకపోవడం విక్రమ్ కు వింతగా తోస్తోంది. విక్రమ్ అవస్థను గమనించి తనలో తానే నవ్వుకుంది హర్షిత.
'ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్?' అంటూ పలకరించింది విక్రమ్ తండ్రి రామారావుని.
'బాగానే ఉందమ్మా...అమ్మ నాన్నవాళ్ళు ఎలా ఉన్నారు?' అన్నాడు.
మాట్లాడుకుంటూండగానే విక్రమ్ వచ్చాడు. తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ, విక్రమ్ ను చూసింది హర్షిత.
ఇంకా అలా ఆలోచనలోనే ఉన్నాడు. అతన్ని అలా చూడగానే హర్షిత పెదాలపై చిరునవ్వు విరిసింది. ఇంకా ఆట పట్టిద్దామని...'ఫ్రెష్ అయ్యి వస్తా అంకుల్. వచ్చాక మీకో గుడ్ న్యూస్' అంది.
పొలమారింది విక్రమ్ కి. అసలేం జరుగుతోంది? ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ ఎవరనుకుంటున్నారు? కొంపతీసి తన భార్య అని అనుకోవడం లేదు కదా?..
వచ్చి తండ్రి వద్ద కూర్చున్నాడు.
'ఏరా..ఎలా ఉంది నీ ఉద్యోగం? అందరూ సఖ్యతగానే ఉంటున్నారు కదా?' అని అడిగాడు రామారావు
'అంతా బాగానే ఉంది నాన్నా..' అన్నాడు కానీ తను ఆ అమ్మాయి గురించి తన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో అడగాలని అనుకుంటూ కూడా అడగలేకపోతున్నాడు.
'చిక్కిపోయావురా...సరిగ్గా తినడం లేదా?' విక్రమ్ తలపై చేయివేసి ప్రేమగా నిమురుతూ అడిగింది తల్లి.
'అబ్బే..అదేం లేదమ్మా..బాగానే తింటున్నా...' అన్నాడు.
తన తల్లిని హర్షిత ఎవరనుకుంటున్నారోనన్న ఆందోళన విక్రమ్ తలను తొలిచేస్తోంది.
'అమ్మా...తను...'
'..మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా...నీ ఉద్యోగం జాగ్రత్త..అప్పుడప్పుడు నువ్వు వస్తూనే ఉన్నావు కదరా..మాకేం బెంగ లేదు..' అంది తల్లి జానకమ్మ.
ఏం మాట్లాడలేకపోయాడు విక్రమ్. రైలులో హర్షిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన తల్లిదండ్రుల కోసం చేస్తున్న ఉద్యోగం వదిలి వచ్చేసింది హర్షిత. తానేమో ఎక్కడో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను చూడటానికి అప్పుడప్పుడూ వస్తున్నాడు. '..మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా...నీ ఉద్యోగం జాగ్రత్త..' అంటూ తన తల్లి ఇప్పుడన్న మాటలు గుర్తుకువచ్చాయి. తన తల్లి వంక ప్రేమగా చూశాడు.
ఫ్రెష్ అయ్యి వచ్చింది హర్షిత.
హర్షితను చూడగానే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు విక్రమ్.
విక్రమ్ అవస్థను చూసి లోలోపల నవ్వుకుంటూనే విక్రమ్ తల్లి దగ్గరకు వచ్చి ఆమె భుజాలపై చేతులేసి కౌగిలించుకుని, ఆమె వెనకనుంచి విక్రమ్ ను చూస్తూ కళ్ళెగరేసింది హర్షిత.
అంతా అయోమయంగా ఉంది విక్రమ్ కి. అసలు హర్షిత ఎవరనుకుంటున్నారు తన తల్లిదండ్రులు?
'అమ్మా...తను....'
'ముందు భోజనం చేసేయండిరా..తర్వాత మాట్లాడుకుందాం...ఎప్పుడు తిన్నారో ఏంటో...?' అన్నాడు విక్రమ్ తండ్రి రామారావు.
'మీరు కూడా వచ్చేయండి..అందరం కలిసి తిందాం..' అంది విక్రమ్ తల్లి జానకమ్మ.
భోజనాలయ్యాయి. హర్షిత, విక్రమ్ తల్లిదండ్రులు ఏవేవో మాట్లాడుకుంటుంటే వింటూ తాను ఏం మాట్లాడకుండా భోజనం ముగించాడు విక్రమ్.
అందరూ వచ్చి హాలులో కూర్చున్నారు. ఇక విక్రమ్ అవస్థకు చెక్ పెట్టేద్దామనుకుంది హర్షిత.
'అప్పుడు మీరు మా ఊరు వచ్చినప్పుడు ఈసారి గుమ్మడి ఒడియాలు పెడదాం అనుకున్నారు కదా...నేను కూడా వస్తా అన్నా...నన్ను పిలవకుండానే గుమ్మడి ఒడియాలు పెట్టేసారా ఆంటీ?..' అంది.
ఒక్కసారిగా విక్రమ్ మనస్సులో ప్రశాంతత ఆవరించింది. హమ్మయ్య..అయితే వీళ్ళకి ముందే ఒకరంటే ఒకరికి పరిచయం ఉందనమాట...అలా మనసులో అనుకోగానే విక్రమ్ పెదాలపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది.
అంతా గమనిస్తూనే ఉంది హర్షిత.
'అబ్బే...ఏం పెట్టలేదే...నువ్ రాకుండా నేనొక్కదాన్నీ పెట్టగలనా?'... అంది జానకమ్మ. హర్షిత అలా అడగడంలో అసలు కారణం తెలియని విక్రమ్ తల్లి.
'పోన్లేండి ఆంటీ...ఇహ నేను వచ్చేసాను కదా...పెడదాం..' ఓరకంట విక్రమ్ ను చూస్తూ అంది హర్షిత.
'మీకు ఒకరంటే ఒకరికి ముందే పరిచయం ఉందన్నమాట'...ఉండబట్టలేక అన్నాడు విక్రమ్.
కిలకిలా నవ్వేసింది హర్షిత. 'అదాంటీ మీ అబ్బాయి టెన్షన్...ఇందాకటి నుంచి మీరు నన్ను ఎవరనుకుంటున్నారా? అని తెగ టెన్షన్ పడిపోతున్నాడు..' అంది.
'అవునురా..పక్క ఊరిలో మొన్నామధ్య ఏదో ఫంక్షన్ కి వెళ్ళాములే మన పక్కింటోళ్ళు నేను..అప్పుడు పరిచయం..ఒక రెండుమూడు సార్లు కలిసాములే..చాలా మంచి పిల్ల'...కితాబిచ్చింది జానకమ్మ.
తేలిక పడింది విక్రమ్ మనస్సు.
అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు. ఇందాక తాను గుడ్ న్యూస్ చెబుతానన్న విషయం గురించి చెబుతూ తాను జాబ్ మానేసిన విషయం, ఇక అమ్మా నాన్నల దగ్గరే ఉండబోతున్న విషయం చెప్పింది హర్షిత.
హర్షిత అలా చెబుతున్నప్పుడు తన తల్లిదండ్రుల కళ్ళలో మెరుపును గమనించాడు విక్రమ్.
అందరూ నిద్రకు ఉపక్రమించారు. విక్రమ్ తానూ పడుకున్నాడు కానీ, మనసులో ఏవో ఆలోచనలు పరుగెడుతున్నాయి.
తెల్లవారింది..
స్నానాలు, టిఫిన్లు అయ్యాక హర్షిత అంది...'ఆంటీ నేను వెళ్ళొస్తాను మరి..అమ్మావాళ్ళు కంగారుపడుతుంటారు. రాత్రి ఫోన్ చేసి చెప్పాననుకోండి. కానీ ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అని ఎదురుచూస్తున్న అమ్మానాన్నలను త్వరగా కలుసుకోవాలి' అంది.
ఇప్పటివరకూ చిలిపిగా ఆటపట్టించేలా సరదాగా గలగలా మాట్లాడే హర్షిత ఆ మాటలంటున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది విక్రమ్ కి. ఆ మాటల్లో చెప్పలేని ఆప్యాయత ఉంది..ఆరాధన ఉంది. విడదీయలేని బంధం ఉంది.
'జాగ్రత్తగా వెళ్ళిరా తల్లీ...ఇక్కడే ఉంటావు కాబట్టి మళ్ళీ వచ్చెయ్...మా వాడు మళ్ళీ ఊరు వెళితే మీ అంకుల్ కి నాకు ఏం తోచదు..నువ్వుంటే సరదాగా ఉంటుంది వాతావరణం...' అంది విక్రమ్ తల్లి జానకమ్మ.
హర్షిత మాటలు, తన తల్లి మాటలు పదే పదే మనసులో మార్మోగుతున్నాయి విక్రమ్ కి.
'మీరంతలా చెప్పాలా ఆంటీ...పొద్దున్న టిఫిన్ మా ఇంట్లో..భోజనం మీ ఇంట్లో..డిన్నర్ మళ్ళీ మా ఇంట్లో...' కిలకిలా నవ్వుతూ అంది హర్షిత.
హర్షిత కబుర్లకు మురిసిపోతున్న తల్లిదండ్రులను చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు విక్రమ్.
హర్షితను వాళ్ళ ఇంటిలో దింపి వచ్చాడు విక్రమ్. హర్షిత వాళ్ళ ఇంటిలో కూడా తన పట్ల వారు చూపించిన ఆప్యాయతకు ముగ్దుడయ్యాడు విక్రమ్.
హర్షితను దించేసి ఇంటికి తిరిగివచ్చాడు.
తాను ఉండగానే ఒకటి రెండుసార్లు ఇంటికి వచ్చివెళ్ళింది హర్షిత. హర్షిత ఎప్పుడు వచ్చినా, తిరిగి వెళ్ళేటప్పుడు తానే వాళ్ళ ఇంటిలో దించి వస్తున్నాడు.
ఆఫీసులో తాను తీసుకున్న శెలవులు అయిపోయాయి. తిరిగి ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్న విక్రమ్ తన తల్లిదండ్రల వైపు చూశాడు.
'జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా...మా గురించేం దిగులు చెందకు...ఈ పిల్ల అప్పుడప్పుడూ వచ్చిపోతూనే ఉంటుందిగా...మాకూ కాలాక్షేపంగా ఉంటుంది...' అంటోంది విక్రమ్ తల్లి జానకమ్మ.
'ఉద్యోగం జాగ్రత్తరా...ఎవరితోనూ తగవులు వద్దు..నీ పనులు నువ్ చూసుకో..ఎవరి విషయాలలో కలుగజేసుకోకు..' జాగ్రత్తలు చెబుతున్నాడు తండ్రి.
రైలు ఎక్కాడు విక్రమ్. మనసు నిండా తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు, హర్షిత మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. కొంత సమయం తర్వాత పెద్దగా నిట్టూర్చాడు. ఏదో నిశ్చయించుకున్నవాడిలా మనసు తేలికపడింది. బయటకు చూస్తూ హర్షిత కబుర్లు, చిన్నపిల్లలా చేసే అల్లరి గుర్తు చేసుకుంటున్న విక్రమ్ పెదాలపై చిరునవ్వు.
------
కొద్ది రోజులు గడిచాయి.
ఒకనాటి ఉదయం హఠాత్తుగా తమ ఇంటిముందు ప్రత్యక్షమైన కొడుకును చూసిన రామారావు, జానకమ్మ ఒక్కసారిగా కంగారు పడ్డారు.
'ఏమైందిరా కన్నా?..అంతా ఓకేనా?..' కొడుకును లోపలకు తీసుకువెళుతూ అడిగారు.
'ఏం లేదమ్మా...కంగారు పడాల్సిందేమీ లేదు..ఇక్కడకు దగ్గరలో ఉన్న ఆఫీసులో జాబ్ కు అప్లయి చేశాను. జాబ్ వచ్చింది..అక్కడి నుంచి వచ్చేసా' అన్నాడు విక్రమ్.
తన తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషంతోపాటు ఆదుర్దాను గమనించాడు.
'అమ్మా....నేను అక్కడ చేసినా, ఇక్కడ చేసినా జాబ్ జాబే..పైగా ఇక్కడ నాకు సాలరీ పెరిగే అవకాశం కూడా ఉంది...అన్నిటికీ మించి మీ దగ్గరగా..మీతో కలిసి ఉండే అవకాశం...మనందరం కలిసి ఉండే అవకాశం లభించిందమ్మా..అందుకే వెంటనే అక్కడ జాబ్ మానేస్తాను అని మేనేజర్ కి చెప్పి వచ్చేసానమ్మా..మా మేనేజర్ కూడా పెర్సనల్ గా ఎంతో సంతోషించాడు తెలుసా? తల్లిదండ్రులతో కలిసి ఉండాలన్న నీ ఆలోచన బాగుంది విక్రమ్ అంటూ పొగిడారు తెలుసా?....' చెప్పుకుంటూ పోతున్నాడు విక్రమ్.
'అమ్మా...నాలో ఈ మార్పును తీసుకువచ్చింది ఎవరో తెలుసా? మన హర్షిత. ఉద్యోగాల పేరుతో చిన్ననాటి నుంచి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వదిలి ఎక్కడో ఉండటం సరికాదంటూ, తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తన తల్లిదండ్రుల కోసం వచ్చేసింది. పెద్ద వయసులో పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురుచూసే తల్లిదండ్రులు, ఆ ఆత్మీయతలు, అనుబంధాలను ఉద్యోగాల పేరుతో నేడు ఎందరో దూరం చేసుకుంటున్నారమ్మా...ఇంతకాలం నేనేం కోల్పోయానో హర్షిత నాకు తెలిసేలా చేసిందమ్మా..నెలలో కేవలం రెండు మూడు రోజులు నేను వస్తానని, నా కోసం నెలంతా ఎదురుచూస్తున్న నా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ప్రేమను, అనురాగాన్ని, ఆత్మీయ బంధాన్ని నాకు తిరిగి కొత్తగా చూపించిందమ్మా...'
ఏదో తెలీని ఉద్వేగంతో చెప్పుకుంటూ పోతున్న విక్రమ్ కళ్ళవెంట దారలా కారుతున్న కన్నీరు బుగ్గలను తడిపేస్తోంది.
'అయ్యో...ఊరుకో నాన్నా...ఊరుకో కన్నా...నువ్వెక్కడున్నా మాముందే ఉన్నట్టుంటుందిరా...మాకెప్పుడూ నువ్ దూరం కాలేదురా...అయ్యో..ఊరుకో నాన్నా...' వీపును సవరిస్తూ, బుగ్గలపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ,  సముదాయిస్తున్న తల్లిదండ్రుల కళ్ళలో కన్నీరు.
ఇంటి గుమ్మం వద్దకు వస్తూ తలెత్తి చూశాడు విక్రమ్. ఎదురుగా హర్షిత.
అభనందిస్తున్న కళ్ళతో విక్రమ్ చేతిలోని బ్యాగులను అందుకుంది.
హర్షితను కృతజ్ఞతగా చూశాడు విక్రమ్.

-0-0-0-0-

Sunday, September 9, 2018

ఒక మంచి నవల చదువుదాం....మధుబాబు 'స్వర్ణఖడ్గం'

Good Novel. కొన్ని చోట్ల మధుబాబు ఈ తరహా ఇతర నవలల్లో ఉన్న సంఘటనలు యదాతథంగా రావడంతో, ఆయా సంఘటనలు చదివే సమయంలో తరువాత జరుగబోయేది ఏంటనేది ఊహకందుతుంది. 


మనసును పాడుచేసే సీరియళ్ళు, లేనిపోని ఆవేశాన్ని కలిగిస్తూ, మనసంతా గందరగోళంగా చేసేసే సినిమాలకంటే ఇటువంటి నవలలు చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. ఇప్పటి జనరేషన్ కి మాయలు, మంత్రాలు, కత్తి యుద్ధాలు, మాంత్రికులు అంటే హ్యారీపోట్టర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. కానీ టివి అంతగా మన జీవితంలోకి రాకముందు తరాలకు హ్యారీపోట్టర్ లాంటివాటిని తలదన్నే ఎన్నో కథలు, నవలలు అందుబాటులో ఉన్నాయని తెలియదు. చందమామలు, బాలమిత్రలు వంటివి చదువుతూ, ఆ బొమ్మలను చూస్తూ ఊహాలోకంలో విహరించిన మన ఆనాటి బాల్యం నేటి ఎంతమంది బాలలు అనుభవిస్తున్నారు? ఆ అందమైన చల్లని వెన్నెల రాత్రులు, వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని కళ్ళవెంట నీళ్ళు కారుతున్నా, ఆవురావురుమంటూ తినడం, కరెంటు పోతే, బయట వర్షం పడుతుంటే దుప్పటి కప్పుకుని అలా వర్షాన్ని చూస్తూ ఆ చప్పుడు జోలపాటగా తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం, సెలవు రోజుల్లో కాలాక్షేపంతోపాటు నాలెడ్జ్ పెంచే చందమామ వంటి పుస్తకాలు తిరగేస్తూ కూర్చోవడం, మండుటెండల్లోనూ చల్లని చెట్లకింద ఆడుకోవడం, పెద్ద పెద్ద అరుగులపై పిల్లలు, పెద్దలు చేరి అష్టాచమ్మా అటలు, కోతులను, ఎలుగుబంట్లను, పాములను ఆడిస్తూ పొట్టపోసుకునేవారు, జాతకాలు చెప్పే కోయవాళ్ళు, పండగొస్తే ఇండ్లలోని కొబ్బరిచెట్లపై నుంచి కొబ్బరి కాయలు దింపి, పందిళ్ళు వేసి సందడి చేసే పనివాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, పెద్దోళ్ళు వంటల హడావిడిలో ఉంటే, అందంగా ముస్తాబై సీతాకోకచిలుకల్లా ఇల్లంతా కలియతిరుగుతుండే బోలెడంతమంది చిన్నారులు, సందడి చేసే కన్నెపిల్లలు ...గుర్తు తెచ్చుకుంటే ఎన్నో మధురస్మృతులు.

 
swarna kadgam novel pdf

Tuesday, February 27, 2018

ఒక మంచి పుస్తకం తోడుగా...


ఒక మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడంటారు. జ్ఞానాన్ని సంపాదించే సాధనంగా పుస్తక పఠనం అనాదిగా వస్తున్నది. ప్రపంచంలోని అనేక నాగరికతలకు సంబంధించిన విశేషాలు, వారి జ్ఞానం, మనకు వివిధ రూపాలలో లభ్యమవుతూ ఉంటాయి. మట్టి పలకలు తదితరాలపై వారి భాష ద్వారా భావితరాలకు తాము సంపాదించిన జ్ఞానాన్ని అందజేసిన ఆనాటి మానవులు తమ తరువాతి తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు. 

మారుతున్న కాలంతోపాటు మానవుల తీరులో నూ ఎంతో మార్పు వచ్చింది. అందరి కోసం పాటుపడే మంచితనం తగ్గి, స్వార్థపూరిత ఆలోచన లు హెచ్చుమీరాయి. నాకేంటి లాభం అనే లాభాల బేరీజులో దారితప్పుతున్న యువత తమ తరువాతి తరాలకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్న సంగతి గుర్తించలేకపోతున్నారు. 

సినిమాలు యువతను చెడగొడుతున్నాయంటూ పలువురు ఆవేదన చెందుతుంటారు. కొన్ని సినిమాలే కాదు, టివిలలో ప్రసారమయ్యే అనేక కార్యక్రమాలు, అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్న చెత్తా చెదారం యువత మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సరైన మార్గద ర్శనం లేకపోవడం, చుట్టూరా స్నేహితుల వ్యవహారశైలి, మనస్తత్వం ఇతరుల మనస్తత్వంలో కూడా మార్పును తీసుకువస్తున్నాయి. 

చుట్టూ మంచి చెప్పేవారు ఉంటే యువతలో మార్పు వస్తుందనడానికి ఎందరో ఉదాహరణగా నిలుస్తుంటారు. ఆదివారం వస్తే చాలు జాలీగా జులాయిగా తిరిగేవారు కొందరైతే, అదే వయసు ఉన్న ఎంతో మంది యువత చేతిలో పవిత్ర గ్రంథాలను పట్టుకుని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ ఆదివారాన్ని గడపడం ప్రతిచోటా మనకు కనిపించేదే. ఏదైనా గుడికి వెళ్దామనేవారు మన యువతలో తక్కువ. ఒకవేళ ఎవరన్నా అలా అనుకున్నా అతనితోపాటు వచ్చేవారు తక్కువ. కా నీ ఇతర మతస్తులలో అలా ఆధ్యాత్మిక భావనలతో మసలే యువతకు మంచి గుర్తింపు ఉంది. ఎ వరైనా అలా దేవుని స్తుతించేందుకు వెళుతున్నానంటే అతనితోపాటు వచ్చేవారు తప్పకుండా ఉంటారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు ఎంతో ప్రశాంతంగా ఉంటారని, మానసిక ఆందో ళన, బిపిలు వంటి సమస్యలు తలెత్తవని విదేశాలలో పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. 

అదేవిధంగా కొన్ని మంచి పుస్తకాలను చదివేవారు కూడా మంచి నడవడికతో ఎంతో హుందాగా నడుచుకుంటూ, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారనే విషయం తరతరాలుగా ఎందరో నిజమని నిరూపిస్తూ తమ జీవితాన్నే ఉదాహరణగా మనముందుంచుతారు. 

శెలవురోజొచ్చిందంటే తోటివారి ప్రోద్భలం, తమకు అంతగా నచ్చకపోయినా ఏదో హీరో చిత్రం వెళ్ళాలంటూ స్నేహితులు పెడుతున్న ఒత్తిడులు, ఫలానా సినిమా చూడలేదా, కొత్త సినిమా చూడలేదా అంటూ కొత్త సినిమా చూడకపోవడం ఒక తప్పన్నట్టుగా కొంతమంది మాటలతో పలువురు ‘నలుగురితో...’ అన్న రీతిన మసలుకుంటూ ఉంటారు. మంచి చిత్రం అనే డెఫినిషన్ పక్కన పెట్టి, తమకు నచ్చిన లేదా తమ గ్రూపులో అధికశాతం అభిమానించే ఫలానా హీరో సినిమా చూడాల్సిందే అనే తీరున కొంతమంది యువత ఉంటారు. ఇది ఒకరి వలన ఒకరు తెలీకుండానే ఉత్తేజితులవుతున్న కారణంగా జరుగుతున్న వ్యవహారం. అదే గ్రూపులో ఒక వ్యక్తి కొంతకాలం పాటు సినిమాలగురించి ఆలోచించే యువతతో కాకుండా, మంచి పుస్తకాలు చదువుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే యువతతో చేరినప్పుడు అతని సినిమాల ఆలోచన పోయి పుస్తక పఠనం, భగవంతుని స్తుతించడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి మార్పులు చోటు చేసుకోవడం అతని పరిసరాల ప్రభావమే. 

హీరో అంటే నలుగురికీ ఆదర్శంగా నిలిచేవాడు అనే పరిస్థితి నించీ...రౌడీని మించి, విలన్ ని మించి వెధవ్వేషాలు వేసేవాడు అనే తీరున కొన్ని చిత్రాలు హీరోయిజం అనే పదానికే అర్థం మార్చేస్తుండటం విచారించవలసిన విషయం. 

కామెడీ కూడా గతి తప్పుతోంది. ఎంతసేపూ కమేడియన్ ని హింసించి శాడిజాన్ని చూపించి అదే కామెడీ గా చిత్రీకరించే విధానం కామెడీ అనే మాటకు తప్పుడు అర్థాన్నిస్తోంది. ఒకప్పుడు రాజేం ద్రప్రసాద్, శ్రీలక్ష్మీ వంటివారు చేసే కామెడీలు ఎంతో సహజంగా ఉండేవి. అదేవిధంగా ఎవర్నీ నొప్పించకుండా, వారు నొప్పించబడకుండా ఉండేవి. అటువంటి పరిస్తితి నుంచి హీరో అంటే కమేడియన్ని కొట్టేవాడు అనే తీరున, కమెడియన్ అంటే అందరిచేతా చీత్కారాలు పొందేవాడు, తన్నులు తినేవాడు అనే తీరున కమెడియన్ల పాత్రలు మారుతుండటం దురదృష్టకరం. 

ప్రజలలో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమాలు కూడా వస్తాయన్న వ్యాఖ్యలు వినవస్తుంటా యి. నిజమే. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనే ఆలోచన కాకుండా మంచి సినిమానా కాదా అనే ఆలోచనతో చిత్రాలను వీక్షించే ధోరణి ప్రజలలో పెరిగిననాడు ఖచ్చితంగా అధికశాతం మంచి సినిమాలే వస్తాయి. 

ఇక పుస్తకాల విషయానికి వస్తే మన దేశంలోని ప్రతి భాషలోనూ ఎంతోమంది అత్యధ్భుతమైన సాహిత్యావిష్కరణ చేశారు. మన ప్రాచీన మానవుల దగ్గర్నుంచి ప్రస్తుతం మన చుట్టూరా ఉన్న సమాజం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణాలకు దూరంగా ఉంటున్న గిరిజనులు, వారి జీవన విధానం, వారి సమస్యలు, పర్యాటక ప్రాంతాలు, మన పూర్వీకులు నిర్మించిన అద్భు త కట్టడాలు, ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాలు....ఇలా ..ఎన్నో ఎన్నెన్నో...
అటువంటి పుస్తకాలు చదువుతుంటే మనం కూడా ఆయా విషయాలపై అవగాహన పెంచుకోగ లం. దాంతోపాటు కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఆ వాతావరణాన్ని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఆనాటి ప్రజలు, వారి సమస్యలు తదితర విషయాలను ా దగ్గర్నుంచి దర్శించిన భావన కలుగుతుంది. వివిధ భాషల పుస్తకాలు చదవడం ద్వారా ఆయా భాషలపై పట్టు పెంచుకోవడంతోపాటుగా ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, అక్కడి ప్రజలు, పరిస్తితు ల గురించి తెలుసుకోగలం. 

కొంతమంది కొన్ని ప్రాంతాలను సందర్శించినప్పడు తమ అనుభూతులను నలుగురితో పంచు కుంటూ రాసే రచనలు, కొంతమంది కాల్పనికత జోడించి రాసే రచనలు వంటివి చదువుతు న్నంత సేపూ ఆ రచనలలో లీనమయిపోతాం. ఆయా రచనలలోని పాత్రలతో ఎంతో సాన్నిహి త్యాన్ని అనుభవిస్తూ ఆయా రచనలలో పాత్రలకు ఆయా సందర్భాలకు అనుగుణంగా ఉద్విగ్న తకు, సంతోషం, దుఃఖం వంటి భావోద్వేగాలకు గురవుతాం. 

కొంతకాలంగా పలువురు ప్రముఖుల రచనలను చదువుతున్న నాకు పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందనే అనిపిస్తోంది. వంశీగారు తదితర ప్రముఖుల రచనలు కొన్ని మనసును హత్తుకుం టాయి. ఆయన రచనల్లోని మా దిగువ గోదావరి కథలు చదువుతున్నప్పుడు ప్రతి కథ కూడా ఒక కొత్త వాతావరణంలోకి నన్ను తీసుకువెళ్ళిపోయింది. నవ్వించింది, ఆలోొచింపజేసింది, కంటతడి పెట్టించింది. మొదటి నుంచి చివరి వరకూ ఆపకుండా చదివించింది. కథలు చదివిన తరువాత కొన్ని రోజుల వరకూ కూడా ఆ కథలోని పాత్రలు నా కళ్ళముందు కదలాడాయి. 

వంశీగారి గోదావరి కథలను చదివేటప్పుడూ, వాడ్రేవు వీరభద్రరావుగారి ‘నేను తిరిగిన దారులు’ చదివేటప్పుడు మదిలో ఏదో తెలీని ఉద్విగ్నత. ఏదో మిస్ అవుతున్న భావన. 

అరకు లోయ గురించి లోయ అందాల గురించి ఎన్నో చదివాను. కానీ....ఆ లోయ, ఆ లోయలో జీవితం గడుపుతున్న గిరిజనులు, వారి జీవన విధానం, వారి సమస్యలు, ఉనికి కోల్పోతున్న వారి జీవనశైలి, ఆధునికత పేరుతో వారి జీవన విధానంలో చేటు చేసుకుంటున్నమార్పులు తదితర విషయాలు వాడ్రేవు వీరభద్రరావు గారి ‘నేను తిరిగిన దారులు‘ లోని ‘అరకు దారుల్లో’ రచనలో 
తొంగిచూసాయి. కేవలం అరకు అందాలే కాక, అక్కడ చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయన్న సత్యాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చదువుతున్నంతసేపూ మనసు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆ గిరిజనులను నేను కూడా ప్రత్యక్షంగా కలుసుకున్నానేమో అనిపించింది. తెలియని ఆవేదనకు గురయ్యాను. ఏడ్చేశాను. 

ఒక మంచి పుస్తకం చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే విజ్ఞానంతోపాటు వినోదం సొంతమవుతుంది. భాషాజ్ఞానం పెంపొందిం చుకోవడంలో కూడా పుస్తక పఠనం ఎంతో ఉప యోగపడుతుంది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ప్రస్తుతం ట్యాబ్ లు, పిసిలలో, పెద్ద స్మార్ట్ ఫోన్లలో చదువుకునేందుకు వీలుగా ‘ఈ బుక్స్’ కూడా లభ్యమవుతున్నాయి. దాంతో ఒక్క ట్యాబ్ చేతిలో ఉంటేచాలు మన ఓపిక.. ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. టెక్నాలజీపై, వివిధ సబ్జెక్టులపై, సైన్స్ ఫిక్షన్, హ్యారీపోట్టర్ లాంటి ఫాంటసీ కథలు ఎన్నో అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వివిధ భాషలను నేర్చుకునేవారు తమ  భాషాజ్ఞానం పెంపొందించుకునేందుకు, వివిధ భాషలను నేర్చుకునేందుకు ఈ ‘ఈ బుక్స్’ ఉపయుక్తంగా ఉంటాయి. 

Monday, February 5, 2018

Wall Hangings తో....ఇల్లే నందనవనము...(wall hangings tho ille nandana vanamu...)

అందమైన వెన్నెల రాత్రులు... చుట్టూరా పూలమొక్కలు.... ఆ చల్లని గాలికి సువాసన సొబగులద్దే లతలు... మనసు దోచుకున్న మనుషులు... ఇది ఒకప్పుడు కేవలం సినిమాకే కాదు, సాధారణ ్రపజానీకం కూడా అనుభవించిన సుందర వాతావరణం.  సొంతిల్లు ఉందీ అంటే, చిన్న ఇల్లయినా, పెద్ద ఇల్లయినా ఇంటి చుట్టూరా, డాబాపైనా కూడా మొక్కలు, చెట్లు, లతలు ఖచ్చితంగా ఉండాల్సిందే...‘అందమైన వెన్నెలలోనా...’, ‘మల్లెలు పూసే, వెన్నెల కాసే...’ అనుకుంటా ఎంతో ఆనందంగా గడిపేవారు ఒకప్పుడు.. పందిర్లు వేసి మల్లె, శంఖం తదితర తీగలు పాకించేవారు. సాయంత్రం, రాత్రి సమయాలలో ఒక వైపు చిన్న గది, ముందు వరండా మాదిరిగా ఉండే డాబాపై ఆ మొక్కల మధ్య, ఆహ్లాదకరమైన, పరిమళభరితమైన, ప్రశాంతమైన వాతావరణంలో కాలాక్షేపం చేసేవారు. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకూ ఉదయం నుండీ రాత్రి వరకూ ఇంట్లో ఉన్నారంటే మొక్కల మధ్య ఉంటేనే కాలాక్షేపం అనే రీతిన అప్పటి రోజులు ఉండేవి. అంతేకాకుండా బొప్పాయి, జామ వంటివాటితోపాటు కొబ్బరి, మామిడి చెట్లను కూడా తమ ఇంటి ప్రాంగణంలో తప్పనిసరి మొక్కల జాబితాలో చేర్చేవారు.
అయితే రానురాను మనుషుల మనసులు స్వార్థపూరితంగా మారాయి. కాస్త నీరు పోస్తే చాలు చల్లటి వాతావరణం, పూలు, పండ్లు అందించే మొక్కలు పెంచడానికి కూడా తమ యావదాస్తి రాసివ్వాలేమో అన్నట్లు ప్రవర్తిస్తున్నవారి సంఖ్య అధికమవుతుండటం దురదృష్టకరం. ఇంటి ముందు, ఇంటి ఆవరణలో సైతం ఒక్క మొక్క కూడా లేకుండా మొత్తం కాంక్రీటు మయం చేస్తున్నవారు ఎందరో ...
మరోవైపు అపార్ట్ మెంట్ సంస్కృతి పెరగడంతో మొక్కల పెంపకానికి స్థలాభావం ఎదురవుతుండటంతో కొంతమంది మొక్కల పెంపకంపై అభిమానం ఉన్నవారు కూడా మొక్కలు పెంచుకోవడానికి లేదే అని ఢీలా పడుతున్నారు. అయితే అటువంటి పరిస్థితులలో ఇంట్లో మొక్కలు పెంచుకునేందుకు వీలు కలిగించే వాల్ హ్యాంగింగ్స్ పలువురికి ఒక మంచి మార్గంగా కనిపిస్తున్నాయి. ఇంటికే అందాన్నిచ్చే మొక్కలను పలువురు వాల్ హ్యాంగింగ్స్ సహాయంతో పెంచుకుంటూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ఆరోగ్యకర వాతావరణాన్నీ రూపొందించుకుంటున్నారు.
ఇదివరకటిలా పెద్ద పెద్ద లోగిళ్ళు లేకపోవడం, కొంచెం స్థలం కూడా మొక్కల పెంపకానికి వదలకుండా కాంపౌండ్ వాల్ ను అంటిపెట్టుకుని మరీ గదులు నిర్మించేస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో వాల్ హ్యాంగింగ్స్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మొక్కలను పెంచుకోవడానికి వాల్ హ్యాంగింగ్స్ ఉపయుక్తంగా ఉండటంతో ఆధరణ పెరుగుతోంది.
వాల్ హ్యాంగింగ్స్లో అడుగు మొదలు మూడడుగుల వరకు వెడల్పయిన కుండీలు లభ్యమవుతున్నాయి. అందమైన డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న వీటిలో ఆకర్షణీయమైన వివిధ రకాల పువ్వులు, అలంకరణ మొక్కలు వేస్తే ఆ అందమే వేరంటూ మొక్కల ్రపియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుండీలలో కోకోపిట్ ను వినియోగించడం ద్వారా బరువు కూడా  ఎక్కువగా ఉండదు. వివిధ రంగులలో ప్లాస్టిక్ కుండీలతోపాటు మట్టితో తయారైన టెర్రకోట హ్యాంగింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో నేరుగా వేసుకోవడం గానీ లేదంటే మొక్కలను కొన్నప్పుడు ఉన్న ప్యాకెట్ తోపాటే ఉంచడం గానీ చేయవచ్చు... వీటిలో సీజనల్ గా వచ్చే మొక్కలతోపాటు బోన్సాయ్ వృక్షాలను కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా అలంకరణ మొక్కలతోపాటు పాదు (క్రీపర్స్) జాతికి చెందిన మొక్కలను పెంచుకోవచ్చు. ఇంటికి వేసిన రంగులతో సరిపోయే వివిధ రకాల అలంకరణ మొక్కలను కూడా హ్యాంగింగ్స్ లో పెంచడం ద్వారా ఇంటికి ఒక కొత్త అందాన్ని తీసుకురావచ్చనడంలో ఏమాత్రం సందేహం లేదు.



Sunday, November 5, 2017

Aakulo Aakunai song from Meghasandesam Movie and interesting history behind it.

మేఘ సందేశం....తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా. సాహిత్యం పరంగా, సంగీతం పరంగా, పాటల పరంగా అప్పటి తెలుగు ప్రజలను అమితంగా ఆకట్టుకున్న సినిమా. ప్రతి పాట కూడా ఎంతో హృద్యంగా సాగిపోతూ వీక్షకులను ఓలలాడిస్తుంటుంది. ఆ సినిమాలో ‘ఆకులో ఆకునై..’ పాటకు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రకృతిని చూసి పులకరించిన ఒక గీత రచయిత మనసులోంచి ఆసువుగా జాలువారిన అక్షరాలు...ప్రకృతిని సైతం పులకరించిపోయేలా చేసిన ఈ గీతం...సాహిత్యం విషయంలో తెలుగు తేనెలొలికించింది. వింటున్నంతసేపు ప్రకృతి ఒడిలో మనం కూడా అలా సేదదీరితే ఎంతబాగుండు అనిపిస్తూ, హృద్యంగా సాగిపోతుంది. మహాగాయని పి.సుశీల గళం నుండి వెలువడిన పదాలు ఎంతో మధురంగా తెలుగు పరిమళాన్ని వెదజల్లుతూ,  ప్రకృతిలో మమేకమై సాగిపోయే మన వారి జీవన విధానాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. మనస్సులో ఎక్కడో అయ్యో మనం కూడా అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉంటే బాగుండు అనిపిస్తాయి.

ఇక ఈ గీతానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పరికిస్తే...ఈ పాట రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. పాటల రచయితగా దేవులపల్లికి ఇది తొలి పాట. 23 ఏళ్ళ వయసులో ఆయన విజయవాడ నుండి బళ్లారి వెళుతున్న సందర్భంలో ట్రైనులో ప్రయాణిస్తున్న సమయంలో...ఆ ట్రైను పచ్చని చెట్లతో, ఆహ్లాదకర వాతావరణం కలిగిన అడవి గుండా ప్రయాణిస్తున్న నేపథ్యంలో...ఆ సుందరమైన ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన దేవులపల్లి మదిలో మెదిలిన పద నాదం...ఈ గీతా పరిమళం. ఈ ఘటన 1923 లో జరిగింది.

కొంతమంది అనుకునే దానిని బట్టి ...1923 లో తన 23 ఏళ్ళ వయసులో దేవులపల్లి, పిఠాపురం దగ్గర ఉన్న తన గ్రామమైన చంద్రపాలెం నుండి ఎయిర్ మద్రాసులో ఒక పాట రికార్డింగ్ నిమిత్తం రైలులో ప్రయాణిస్తున్న సందర్భంలో...ఆ రైలు నల్లమల అడవి గుండా ప్రయాణం సాగిస్తోంది. ప్రకృతి సోయగంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణం చూసి ముగ్ధుడైన దేవులపల్లి మదిలో మెదిలిన భావాలకు అక్షర రూపమే ఈ పాట. ఈ పాట 1923 లో రాయడం జరిగితే, దాదాపు 40 సంవత్సరాల అనంతరం ‘మేఘ సందేశం’ సినిమాలో ఒక భాగమై, ప్రకృతి రమణీయతపై ప్రజలకు మరోసారి మక్కువ కలిగేలా చేసింది.

ఈ గీత రచన ఆంగ్లంలో రెండు సార్లు తర్జుమా చేయబడింది. ఒకసారి వి.ఎన్. భూషణ్ ద్వారా, మరోసారి ఆచంట జానకీరామ్ ద్వారా...ఇవి 1928లో త్రివేణి పత్రికలో ప్రచురించబడ్డాయి కూడా.

ఇక చిత్రం విషయానికి వస్తే....మేఘ సందేశం సినిమా 1984లో విడుదలైంది. అటు అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నిర్మాత, దర్శకుడు అయిన దాసరి నారాయణ రావుకు తమ సినీ జీవితంలో చిరస్మరణీయమైన చిత్రంగా నిలిచింది. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రతి పాటను అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. వేల పాటలతో ఎందరో శ్రోతల హృదయాలను గెలుచుకున్న గంధర్వ గాయని పి.సుశీల గొంతులోంచి వెలువడిన ఈ ‘ఆకులో ఆకునై’ పాట...ఆ సినిమాలో మాత్రమే కాక, సినిమా విషయం పెద్దగా తెలియని వారికి సైతం చిరపరిచయం. సినిమాతో పట్టింపు లేకుండా ప్రతిఒక్కరికీ చేరువైన సాహిత్య, గానసుమం.